నర్సంపేట, సెప్టెంబర్13: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి సమీపంలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి నర్సంపేటకు ప్రతిరోజూ బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలుతున్నది. కొంత మంది ముఠాగా ఏర్పడి కొత్తగూడ మండలం నుంచి నర్సంపేటకు యూరియాను రవాణా చేస్తున్నారు. బస్తా యూరియా రూ.600 చొప్పున విక్రయిస్తున్నట్టు తెలిసింది. నర్సంపేటలో యూరియా దొరకడంలేదని కొంత మంది రైతులు తెల్లవారుజామునే కొత్తగూడకు వెళ్లి ఒక్కో బస్తాకు రూ.600 చెల్లించి బైక్‌లపై తీసుకొస్తున్నారు. నర్సంపేటలో దళారులు సైతం యూరియాను బ్లాక్ చేసి రూ.450కి అమ్ముకుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వం రూ.267కు బస్తా యూరియా అందిస్తుంటే దళారులు బ్లాక్ మార్కెట్లో డబుల్ రేట్లు పెట్టి విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.