ఖైరతాబాద్, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు మొండిచేయి చూపారని యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలంటే సీఎం రేవంత్‌రెడ్డికి చులకన భావన ఉన్నదని, అందుకే ఈ బడ్జెట్లో ఆ వర్గాల పట్ల చిన్నచూపు చూశారని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే బీసీల కోసం ఐదేండ్లకు లక్ష కోట్లు కేటాయిస్తామని నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ సభలో స్యయంగా హామీ ఇచ్చారని తెలిపారు. తీరా తొలి బడ్జెట్లో కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. జనాభాలో 55 శాతానికి పైగా ఉన్న బీసీలకు బడ్జెట్లో కేవలం 3.4 శాతం మాత్రమే కేటాయించడం బాధాకరమని పేర్కొన్నారు.
నోటితో హామీలిచ్చి, నొసటితో బీసీలను వెక్కిరించిన విధంగా బడ్జెట్ ఉన్నదని పేర్కొన్నారు. బీసీలను తెలివి తక్కువవారిగా అంచనా వేస్తున్నారని, అందుకే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ను టిష్యూ పేపర్‌గా పక్కన పడేశారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వృత్తిదారుల రక్షణకు నూరుశాతం సబ్సిడీతో ప్రవేశపెట్టిన అనేక పథకాలు, రుణాల పంపిణీని కొనసాగిస్తారో లేదో కాంగ్రెస్ పాలకులు తేల్చి చెప్పాలని యూపీఎఫ్ కోకన్వీనర్ తాడూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఫూలే సబ్‌ప్లాన్‌ను ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని, అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాల్సిందేనని, లేని పక్షంలో ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని స్పష్టం చేశారు. సమావేశంలో యూపీఎఫ్ కోకన్వీనర్ రాజారాం యాదవ్, డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ, ఆర్వీ మహేందర్‌కుమార్, బోల్ల శివశంకర్, కోల శ్రీనివాస్, అలకుంట హరిబాబు, జంగయ్య, గీతా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.