హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేత మన తెలంగాణలో పుట్టడం, దేశాన్ని సుభిక్షంగా పరిపాలించుకోవాలనుకోవడం వరంగా భావించాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పేర్కొన్నారు. కరువు కాటకాలతో కునారిల్లుతున్న పూర్వ మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా జలాలతో మణిహారాన్ని అలంకరించారని కొనియాడారు. వలసల జిల్లాలుగా పేరుపడ్డ దక్షిణ తెలంగాణాలోని ఆరు జిల్లాలు సస్యశ్యామలంగా కళకళలాడేందుకు పాలమూరు-రంగారెడ్డిని ఆవిష్కరించడం సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు.