హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
క్యుములోనింబస్ మేఘాలతో సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. ద్రోణి, ఆవర్తనాలతో వచ్చే నాలుగు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. మంగళవారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.
అత్యధికంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో 41.7, నిర్మల్లో 41.5, జగిత్యాలలో 41.4, ఆదిలాబాద్లో 41.2, కామారెడ్డిలో 41.1, నల్లగొండలో 41.1, కుమ్రం భీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల, మంచిర్యాల, నారాయణపేట, నాగర్కర్నూల్, మెదక్, వనపర్తి జిల్లాల్లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. మిగతా జిల్లాల్లో 37 నుంచి 40 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొన్నది. బుధవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.