అశ్వారావుపేట టౌన్, మే 18: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో ఆదివారం కురిసిన వర్షం.. అన్నదాతలను ఆగంచేసింది. ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల అన్నదాతలు భారీగా నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఇంకెంత నష్టం వాటిల్లుతుందోనిన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆదివారం నాటి అకాల వర్షానికి పలు గ్రామాల రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలుపడ్డారు.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, ఉట్లపల్లి, నారాయణపురం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడవకుండా పరదాలు కప్పారు. కానీ కేంద్రాల్లోకి మాత్రం వరదనీరు చేరింది. 20 రోజులైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్లనే తమ పంటలు వరదపాలై తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.