Telangana | నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఏప్రిల్ 16 : ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు అకాల వర్షం కన్నీళ్లు తెప్పించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో దెబ్బతిన్న పంటలతో రైతులు తల్లడిల్లిపోయారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో కాంటాలకు సిద్ధంగా ఉన్న ధాన్యంపై అడుగు మేర నీళ్లు చేరడంతో అన్నదాతలు ఆ నీళ్లను బకెట్ల తో ఎత్తిపోశారు. అర్ధరాత్రి కావడంతో ఎక్కువమంది రైతులు ఆరబెట్టిన ప్రదేశాలకు చేరుకోలేకపోయారు. ఖమ్మం రూరల్ మండలం లో కొద్దిరోజుల క్రితమే నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. గన్నీబ్యాగుల కొరత, కాంటాల ప్రక్రియ ఆలస్యం కారణంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాసులు పోటెత్తాయి.
అర్ధరాత్రి మొదలైన వర్షాన్ని కూడా లెక్కచేయకుండా రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు తెచ్చుకున్న కొద్దిపాటి పరదాలను పంటలపై కప్పి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. తిరుమలాయపాలెం, దుమ్ముగూడెం మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వడ్లు రాలిపోయాయి. మధిర, బోనకల్లు, చింతకాని మండలాల్లో మక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిన్నది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మక్కజొన్న పంటలు తడిచిపోయాయి. అశ్వారావుపేట, దమ్మపేటల్లో పది రోజులుగా రోజు విడిచి రోజు వర్షం కురుస్తూ రైతులకు నష్టాన్ని మిగుల్చుతున్నది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి, వీచిన ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు కూలాయి. దీంతో సరఫరా నిలిచిపోయింది. చెట్లు కూడా విరిగిపడ్డాయి. చేతికొచ్చిన మక్కజొన్న నీటిపాలైంది. మామిడి, పొగాకు, మునగ, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పలువురి ఇండ్లు దెబ్బతిన్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసింది. వరి, మక్కజొన్న, అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆరబోసిన మక్కజొన్నలు కొట్టుకుపోయాయి. కల్లాల్లోని మిర్చి తడిసిపోయింది. చెట్లు కూలగా, విద్యుత్తు స్తంభాలు విరిగిపడటంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో విద్యుత్తు వైరు తెగిపడటంతో నాగెల్లి ఉప్పలమ్మ(65) కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. పలు చోట్ల ఇండ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు గ్రామంలో పిడుగు పాటుకు రెండు దుక్కిటెద్దులు మృత్యువాతపడగా, నర్సింహులపేటలో కరెంట్ షాక్‌తో రెండు ఆవులు చనిపోయాయి.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో బుధవారం మధ్యాహ్నం అరగంటకుపైగా కురిసిన అకాల వర్షం రైతులను ఆగం జేసింది. కోమట్‌పల్లి, పోతాయిపల్లి లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. వరద నీటి ప్రవాహానికి వడ్లు కొట్టుకుపోయాయి. వడగండ్లు పడటంతో గింజలు రాలిపోయాయి. మరోవైపు కుప్పపోసిన వడ్లలోకి నీళ్లు చేరాయి. కొనుగోలు కేంద్రా ల్లో కాంటా ప్రారంభించక పోవడంతో ధాన్యం రాశులు పేరుకుపోయాయని, అకాల వర్షాల వల్ల కుప్పల్లోకి నీరు చేరిందని రైతులు వాపోయారు. పోతాయిపల్లిలో ఆరబెట్టిన ధాన్యం వరద నీటిలో కోట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. కొట్టుకుపోయిన ధాన్యాన్ని దోసిళ్లతో ఎత్తారు.