ఖమ్మం, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 21: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్నిచోట్ల ఇళ్లపై రేకులు, పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వైరా మండలం దాచాపురం, గన్నవరం గ్రామాల్లో రోడ్ల వెంబడి ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి నీటిపాలైంది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో తాళ్లూరి నాగేశ్వరరావు ఇంటి గోడ కూలిపోయింది.
బత్తుల రాజు ఇంటి పైకప్పు రేకులు కొట్టుకపోయాయి. పినపాక మండలం తోగ్గూడెంలో బూరిక చరణ్ పూరిల్లు పైకప్పు ఎగిరిపోయింది. ఎంపీడీవో కార్యాలయం వద్ద చెట్లు విరిగిపడడంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. బూర్గంపహాడ్ మండల కేంద్రంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. కరకగూడెం, చర్ల మండలాల్లో కరెంట్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. అంగారుగూడెంలో సుమారు 20 ఇళ్లు కూలిపోయినట్లు సమాచారం.