హైదరాబాద్, మార్చి 20 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి తీరని అన్యాయం జరిగిందని, పునఃసమీక్షించి వెంటనే రూ.1,000 కోట్లు కేటాయించి చేనేతలను ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనరసయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల పోరాటాన్ని ఎదురోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
గురువారం హైదరాబాద్లో వారు మీడియాతో మాట్లాడారు. చేనేతకు, జౌళి(టెక్స్టైల్) శాఖకు కలిపి రూ.370 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పినా అందులో పవర్లూమ్కు రూ. 237.46 కోట్లు, చేనేత, పవర్లూం కలిపి రూ.102.54 కోట్లు, నేతన్న బీమాకు రూ.15 కోట్లు, రాష్ట్ర, జిల్లా కార్యాలయాల నిర్వహణకు రూ.35.83 కోట్లు ప్రతిపాదించారని తెలిపారు. వాస్తవంగా చూస్తే ప్రత్యేకంగా చేనేత అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు ఏమీ లేవని తెలిపారు.
స్వయం సహాయక మహిళా సంఘాలలోని 65 లక్షల మందికి నాణ్యమైన రెండు చీరలు నేయించి ఇస్తామన్న హామీ నెరవేర్చేందుకు నిధులు కేటాయించనందున అటు మహిళలను, ఇటు నేతన్నలను దగా చేయడమేనని విమర్శించారు. చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకపోయి చేనేత కార్మికులు ఆత్మహత్యల పాలవుతుంటే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదాని ప్రశ్నించారు.