Paddy Procurement | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): అసలే పైసల్లేవు.. అప్పు పుడతలేదు.. గత సీజన్ ధాన్యం బకాయిలే పెండింగ్‌లో ఉన్నయి.. ఈ యాసంగి వడ్లు కొనేదెట్ల.. అని పౌరసరఫరా శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అప్పు ఎక్కడా పుట్టక, ధాన్యం కొనుగోళ్ల గడువు తరుముకొస్తుండటంతో అయోమయంలో పడ్డారు. అప్పులిచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకొస్తలేవని తెలిసింది. సర్కారు తరఫున గ్యారెంటీ ఇస్తామన్నా బ్యాంకులు ససేమిరా అంటున్నట్టుగా సమాచారం.
ఈ దశలో ఇప్పటికే అన్ని బ్యాంకులను సంప్రదించిన సివిల్ సైప్లె అధికారులు ఆశలు వదులుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఈ నెలాఖరు నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాసంగిలో సుమారు 57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. దీంతో సుమారు 1.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇందులో సుమారు 80 నుంచి కోటి టన్నుల ధాన్యం కొనుగోలును సివిల్ సైప్లె లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. కనీసంగా 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కోసమైనా ప్రభుత్వానికి రూ.18 వేల కోట్లు కావాలి. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు అదనపు నిధులు అవ సరం. ఈ నేపథ్యంలో ఇంత భారీ మొత్తం సమకూర్చుకోవడం ఇప్పుడు సివిల్ సైప్లె అధికారులకు సవాల్‌గా మారింది.
బ్యాంకుల్లో అప్పు పుట్టని నేపథ్యంలో సివిల్ సైప్లె అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) రుణం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ ఎన్సీడీసీ కేవలం ఫెడరేషన్లకు మాత్రమే రుణం ఇస్తుంది. ఈ కారణంగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి చర్యలు మొదలు పెట్టినట్టు తెలిసింది. ఈ మేరకు రూ.8 వేల కోట్ల అప్పు కావాలంటూ లేఖ రాసినట్టు తెలిసింది. ఈ రుణం మంజూరైతే ధాన్యం కొనుగోళ్లు మొదలు పెట్టొచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం.
ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామం టూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. తీ రా అధికారంలోకి వచ్చాక కేవలం సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తామంటూ మాట తప్పింది. ఇందులో భాగంగానే గత వానకాలం సీజన్ నుంచి సన్న ధాన్యానికి బోన స్ ప్రకటించింది. వానకాలం సీజన్లో 24 లక్షల టన్నుల సన్నరకం వడ్లను కొనుగోలు చేసింది. రైతులకు బోనస్ కింద రూ.1,200 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. వా టిలో ఇప్పటివరకు సుమారు రూ.800 కో ట్లు మాత్రమే రైతులకు చెల్లించగా, ఇంకా రూ.400 కోట్లు బకాయి పెట్టినట్టు తెలిసిం ది. ధాన్యం కొనుగోళ్లు ముగిసి రెండు నెల లు అవుతున్నా బోనస్ బకాయిలు చెల్లించకపోవడం గమనార్హం. ఈ బోనస్ పైసల కోసం అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరి గినా ప్రయోజనం లేకుండా పోయిందం టూ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సర్కారు ఈ యాసంగిలో రైతులకు బోనస్ ఇస్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇస్తామన్నా, ఎప్పటికి ఇస్తుందోనని రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఈ యాసంగి సీజన్లో దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకూ అప్పు పుట్టే పరిస్థితి లేక, ఆ రైతులు కూడా బిల్లుల కోసం నెలల తరబడి వేచి చూడక తప్పదనే అనుమానాలు రైతుల్లో కలుగుతున్నాయి.