హైదరాబాద్, ఫిబ్రవరి 15 ; (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఉచిత పథకాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం మగ్దూంభవన్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలు రక్తం ధారపోసి సంపద సృష్టించి జీఎస్టీ రూపంలో చెల్లిస్తున్న డబ్బులనే ప్రభుత్వాలు సంక్షేమానికి వినియోగిస్తున్నాయని, అలాంటప్పుడు సంక్షేమ పథకాలను ఉచితాలని పేర్కొనడం అర్థరహితమని పేర్కొన్నారు. ఉచితాలు ఇవ్వడం తప్పంటూ ప్రధాని మోదీతోపాటు జయప్రకాశ్‌నారాయణ్ లాంటి కొందరు మేధావులు స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి కొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వంతపాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.