Harish Rao | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): బీర్ల ఉత్పత్తి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు నిలిపివేయడంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వానికి యునైటెడ్ బ్రూవరీస్ బీర్ సరఫరాను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బీరు సరఫరాకు సంబంధించి బకాయిలు చెల్లించడంలో విఫలమైందని యునైటెడ్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పిందని తెలిపారు.
యునైటెడ్ బ్రూవరీస్ బీరు విక్రయాలను నిలిపివేయడం వల్ల తెలంగాణలో కింగ్‌ఫిషర్, హీనెకెన్ వంటి ప్రీమియం బ్రాండ్ల లభ్యతకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. బూమ్ బూమ్, బీర్యానీ బీర్ల వంటి స్థానిక బ్రాండ్లను ప్రచారం చేయడానికి ఇది ప్రభుత్వ ఉద్దేశపూర్వక ప్రయత్నమా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సీనియారిటీ, మెరిట్‌కు కట్టుబడకుండా కమీషన్లకు బిల్లులను క్లియర్ చేయడంలో నేటి ప్రభుత్వం పాటిస్తున్న ‘ప్రాధాన్యం’ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా? అని నిలదీశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా బిల్లులను క్లియర్ చేసేదని తెలిపారు.
యూబీ కంపెనీకి బకాయిలు రూ.658.95 కోట్లే
బీర్ల ధరల పెంపు అనేది హైకోర్ట్ విశ్రాంత జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ పరిశీలనలో ఉన్నదని, ఆ కమిటీ నివేదిక వచ్చాక.. దానిని పరిశీలించి ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం మీడియాతో చెప్పారు. కమిటీ నివేదిక ఇవ్వకముందే బేవరేజెస్ కార్పొరేషన్‌పై ఒత్తిడి తీసుకురావడం సరికాదని చెప్పారు. రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయంలో యూబీఎల్ది 70 శాతం గుత్తాధిపత్యం ఉండటం వల్లే ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.
వారి ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం తలొగ్గదని పేర్కొన్నారు. యూబీకి 2023 డిసెంబర్ 7నాటికి రూ.407.34 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని, అప్పట్నుంచి 2025 జనవరి 7 వరకు మొత్తం రూ.1,130.99 కోట్ల బకాయిలను క్లియర్ చేశామని చెప్పారు. యూబీ కంపెనీకి ప్రస్తుతం రూ.658. 95 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉన్నదని మంత్రి వివరించారు. బీర్ల ధరలు 33.1 శాతం పెంచాలని యూబీ కంపెనీ కోరుతున్నదని, ధరలు పెంచితే మద్యంప్రియులపై భారం పడుతుందని తెలిపారు.