Boiled Rice | హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ తీసుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే మీ రాష్ట్ర ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయండి. అంతేగానీ మేం మాత్రం బాయిల్డ్ రైస్ తీసుకోం’.. ఇదీ తమ రాష్ట్ర రైతులు పండించిన బాయిల్డ్ రైస్‌ను తీసుకోవాలని కోరిన తెలంగాణ మంత్రులు, ఎంపీలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఒకప్పటి అహంకార పూరిత సమాధానం. ఇప్పుడు అదే కేంద్రం దేశంలో బాయిల్డ్ రైస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, ఎగుమతులపై ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నది. కేంద్రం తీసుకుంటున్న ఈ తలతిక్క విధానాలు రైతాంగానికి పెను శాపంగా పరిణమిస్తున్నాయి. దేశంలో బియ్యం ఉత్పత్తి, అవసరాలపై కేంద్రానికి ఎలాంటి అవగాహన లేదని ఈ నిర్ణయాలు చెప్పకనే చెబుతున్నాయి. దేశంలో బాయిల్డ్ రైస్‌కు కొరత ఏర్పడే ప్రమాదం ఉండటంతో ఎగుమతులపై 20 శాతం వరకు పన్ను విధించడం ద్వారా ఇతర దేశాలకు తరలిపోకుండా అడ్డుకోవాలని చూస్తున్నది.
దేశంలో ఇప్పటికే నాలుగేండ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ నిల్వలు ఉన్నాయని, వాటి వినియోగం గణనీయంగా తగ్గిపోతున్నదని రెండేండ్ల కిందట చెప్పిన కేంద్రం.. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమని తేల్చి చెప్పింది. వాటిని తీసుకుని తామేం చేసుకోవాలని ప్రశ్నించింది. రైతులను వరిసాగు నుంచి ఇతర పంటలవైపు మళ్లించాలని రాష్ర్టాలకు సూచనలు కూడా చేసింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రాధేయపడినా, సీఎం కేసీఆర్ స్వయంగా ధర్నా చేసినా, రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిసి మొరపెట్టుకున్నా కొనేందుకు కేంద్రం ససేమిరా అంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అయితే బాయిల్డ్ రైస్ తీసుకోబోమని, కావాలనుకుంటే మీ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండంటూ అహంకారంగా మాట్లాడారు. ఇప్పుడేమో బాయిల్డ్ రైస్ కొరత ఉందంటూ ఎగుమతులపై ఆంక్షలకు కేంద్రం సిద్ధమవుతున్నది. నాలుగేండ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పిన కేంద్రం రెండేళ్లు కూడా తిరక్కముందే ఇప్పుడు చేతులెత్తేసింది. బియ్యం కొరత ఉందంటూ ఎగమతులపై నిషేధం విధించింది. భారత్‌పై ఆధారపడిన పలు దేశాలకు ఈ నిర్ణయం శరాఘాతమైంది. భారత్ నిర్ణయాన్ని పలు దేశాలు తీవ్రంగా నిరసించాయి. కేంద్రం అస్తవ్యస్త నిర్ణయాలతో విదేశాల్లో దేశ ప్రతిష్ఠ మంటగలిసిపోతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల పాలిట శనిలా దాపురించిందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ధాన్యాన్ని కొనకుండా రైతులకు నష్టం కలిగించిన కేంద్రం ఇప్పుడు బాయిల్డ్ రైస్ ఎగుమతులపై సుంకం విధించాలని ఆలోచిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా రైతాంగానికి మరోమారు నష్టం చేకూర్చే పనులు చేస్తున్నదని దుయ్యబట్టారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనాలని కోరితే నూకలు తినాలని అవమానించిన కేంద్రం ఇప్పుడు అదే బాయిల్డ్ రైస్ ఎగుమతులపై పన్నులు విధించాలనుకోవడం ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి, రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని కేంద్రానికి హితవు పలికారు.