Kishan Reddy | వరంగల్, జూలై 2: బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. తెలంగాణ హక్కు. విభజన చట్టం ప్రకారం ఈ ఉక్కు ఫ్యాక్టరీని కట్టాల్సింది కేంద్రమే. కానీ, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నాలుక మతడేశారు. రాష్ట్రమే కట్టుకోవాలంటూ వింత వాదనకు దిగారు. ఆదివారం హనుమకొండలో ఆయనను విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు, కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటుపై మీడియా ప్రశ్నించగా.. ఆ ఫ్యాక్టరీని రాష్ట్రమే కట్టుకోవాలని వాదించారు. పైగా, ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడా? అని సీఎం కేసీఆర్‌ను ఎదురు ప్రశ్న వేశారు. వరంగల్ ప్రజల ఆకాంక్ష అయిన కోచ్ ఫ్యాక్టరీని ఇతర రాష్ర్టాలకు తరలించారు కదా అని అడగ్గా, ఏదో ఒక ఫ్యాక్టరీ వచ్చింది కదా అని బుకాయించారు. వచ్చిన వాటితోనే సంతోషించాలంటూ సూక్తులు వల్లించారు.
అదీకాక.. మేడారం జాతీయ పండుగ ప్రకటనపైనా మాట మార్చారు. దేశంలో ఏ పండుగకూ జాతీయ హోదా కల్పించలేదని వ్యాఖ్యానించారు. కాజీపేట సమీపంలో పీడియాడికల్ వ్యాగన్ ఓవరాలింగ్ యూనిట్‌తో పాటు వ్యాగన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని, దీనిలో భాగంగానే ఈ నెల 8న ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారని తెలిపారు. గతంలో అనుకున్న కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాలేదని, దాని స్థానంలో వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు నుంచి కేంద్రం తప్పించుకొనే ప్రయత్నం మొదలుపెట్టిందని మండిపడింది. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష మరోసారి బహిర్గతమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.