హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి తగినంత బలం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఉన్న ఆయన జూబ్లీహిల్స్ ఫలితాలపై స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఏనాడూ ఎమ్మెల్యే సీటు గెలువలేదని, ఆ నియోజకవర్గ పరిధిలో ఒక్క కార్పొరేటర్ కూడా తమ పార్టీకి లేడని చెప్పారు. అయినా ఈ నియోజకవర్గం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నందున.. ఆలస్యంగా ఇన్చార్జి బాధ్యతలు తీసుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న వనరులను ఉపయోగించి ప్రచారం నిర్వహించినట్టు చెప్పారు.
అయినా ఎన్నికలకు ముందు తాము ఓడిపోతామని చెప్పడం సరికాదని.. ఫలితాలు అనుకూలంగా రావని తెలిసినా పోటీ చేసినట్టు చెప్పారు. ఓల్డ్ సిటీలో ఒకే పార్టీ మినహా మరో పార్టీ గెలువదని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలు తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపించారు. కొన్ని సామాజిక సమీకరణాలు తమకు ప్రతికూలంగా మారాయని, అయినా ఉన్నంతలో అన్నిరకాలుగా ప్రయత్నం చేశామని చెప్పారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ప్రజల దృష్టిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నవ్వుల పాలయ్యారని ఆరోపించారు. ఈవీఎంలపై ఆరోపణలు చేసిన ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలా గెలిచారు? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.