Singareni | సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని పార్లమెంట్ వేదికగా కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. పార్లమెంట్ వేదికగా ఇటీవల ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి మౌఖికంగా సమాధానం ఇచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 51శాతం, కేంద్ర ప్రభుత్వం వాటా 49శాతం ఉందని.. కేంద్రం సింగరేణిని ఎలా ప్రైవేటీకరిస్తుందని ప్రశ్నించారు. తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సింగరేణి అంశంపై ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గనుల కేటాయింపులో పారదర్శకత ఉండేందుకే వేలం ప్రక్రియను చేపడుతున్నామన్నారు. ఇందులో ప్రభుత్వాలతోపాటుగా ప్రైవేటు సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు.