హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ, రాబర్ట్‌వాద్రా దేశ సైనిక శక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలను తప్పుబట్టారు. భారత సైన్యం సాధించిన విజయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గమని నిప్పులు చెరిగారు.
భారత్ తమపై దాడులు చేసిందని పాక్‌ప్రధాని ఒప్పుకున్నారని, కానీ కాంగ్రెస్ నేతలు ఈ అంశంలో వితండవాదన చేస్తున్నారని మండిపడ్డారు. పీవోకేను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, అసలు పీవోకేను పాక్‌కు అప్పగించిందే కాంగ్రెస్ పాలనలో అని విమర్శించారు. బీజేపీ హయాంలో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు సర్జికల్ స్ట్రయిక్స్ చేశామని.. కాంగ్రెస్ హయాంలో ఒక్కసారైనా సర్జికల్ స్ట్రయిక్స్ చేశారా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.