హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం యూరి యా విషయంలో కృత్రిమ కొరతను ప్రోత్సహించడం సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రూ.266 ఉన్న సబ్సిడీ యూరియా బస్తాను రైతులు రూ.400 కు కొనాల్సి వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడమేంటని ప్రశ్నించారు. రాష్ర్టానికి కేంద్రం పంపుతున్న యూరియా బ్లాక్ మార్కెట్లోకి ఎలా వెళ్తోన్నదో చెప్పాలని నిలదీశారు. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే దురుద్దేశాన్ని కాంగ్రెస్ నేతలు మానుకోవాలని హెచ్చరించారు. రైతులకు సక్రమంగా యూరియా అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని సూచించారు.