Kishan Reddy | హైదరాబాద్, జనవరి27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డెవలప్మెంట్ కో-ఆర్డినేషన్, మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో శనివారం దిశ కమిటీ సమావేశం జరిగింది. కిషన్రెడ్డి నేతృత్వంలో సుదీర్ఘంగా 4 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల స్థితిగతులు, విద్యుత్తు సమస్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు తదితర పలు అంశాలపై చర్చించారు.
అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి తెలంగాణకు 80% ఆదాయం వస్తున్నదని, నిత్యం దాదాపు 10 లక్షల మంది హైదరాబాద్కు రాకపోకలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయని, అంగన్వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లు కిరాయి భవనాల్లో కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే అంబర్పేట, ఉప్పల్ ఫె్లైఓవర్లు పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాలని కోరారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధితోపాటు కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హెచ్ఎండీఏ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, వివిధ శాఖల అధికారులు, దశ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.