హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): దేశంలో రాహుల్‌గాంధీ తర్వాత రేవంత్‌రెడ్డే మేధావి అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చురకలంటించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిందని దుయ్యబట్టారు. అందుకే నాడు టీడీపీ పార్టీ పుట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాను ఒక్కడినే మేధావిని అనుకుని అద్దాల మేడలో కూర్చుని ఇతరులపై రాళ్లు వేయడం మంచిది కాదని హితవు పలికారు. బీజేపీ నేత లక్ష్మణ్ వలస పోయారని రేవంత్‌రెడ్డి అంటున్నారని, మరి ఇందిరాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఎక్కడి నుంచి పోటీ చేశారని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా కోశాధికారి అయ్యారని కిషన్‌రెడ్డి చురకలు అంటించారు. ముఖ్యమంత్రి హైబ్రిడ్, జీడీపీ పరంగా సీట్లు పెరుగాలని అంటున్నారని, ప్రపంచంలో ఇలా ఎక్కడా లేదని చెప్పారు.