Bandi Sanjay | హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ (హెచ్‌సీయూ) భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే.. వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలని చూడకుండా జుట్టుపట్టుకుని గుంజుకుపోయి చితకబాదుతారా? ఇదేం పద్ధతి? భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములమ్మి వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా? రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? అని నిలదీశారు. అంత మాత్రాన మీరెందుకు…కేఏ పాల్ కు అప్పగించినా అదే పని చేస్తారు కదా?‘‘అంటూ మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జి చూసి బాధపడని వాళ్లు లేరని, ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఏదో గొప్ప పనిచేశామని అనుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేనట్లుందని మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే… వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలని చూడకుండా జుట్టుపట్టుకుని గుంజుకుపోయి చితకబాదుతారా? ఇదేం పద్దతి? భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? ఈనెల జీతాలివ్వాలంటే భూములు అమ్మాల్సిందేనా? భూములన్ని వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా? రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రూముల్లో దూరి కొడతారా? రాత్రివేళ ఇష్టమొచ్చినట్లు కొట్టి అరాచక పాలన చేస్తారా? అని మండిపడ్డారు.
లాఠీఛార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని.. మొత్తం ఘటనపై విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది? వాళ్లంతా విద్య గురించి మాట్లాడేవాళ్లు కదా? కమ్యూనిస్టు భావజాలంతో కొట్లాడతామని చెప్పుకుంటారు కదా? మరి వాళ్ల నోళ్లెందుకు మూతపడ్డాయి అని బండి సంజయ్ ప్రశ్నించారు. వేల కోట్లకు భూములమ్మితే మీకు కూడా కమీషన్లు వస్తున్నాయని మౌనంగా ఉన్నారా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
అసలు వర్శిటీ భూములు అమ్మాల్సిన కర్మ ఏంది? అమ్మడానికి మీరెవరు? అభివృద్ధి పేరుతో భూములను అమ్మి పాలించడానికి మీరెందుకు? అని ప్రశ్నించారు. కేఏ పాల్‌కు అప్పగించినా అదే పని చేస్తారు కదా అని అన్నారు. మరి అప్పులు తెచ్చి, భూములు అమ్మి, ప్రజల ఆస్తులను అమ్ముతామని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు. చెబితే ఒక్క ఓటు కూడా పడకపోయేది కదా? అని వ్యాఖ్యానించారు. హెచ్ సీయూ భూముల అమ్మకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.