Bandi Sanjay | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ‘నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే.. నక్సలైట్లతో కలిసి ఎంతో మందిని గద్దర్ హత్య చేయించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పద్మ అవార్డులపై సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు. పేర్లను సిఫారసు చేసేటప్పుడు రాష్ట్రప్రభుత్వం ఆలోచించుకోవాలని సూచించారు. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఒకవేళ మార్చితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కల్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వ నిధులతో అమలుచేసే సంక్షేమ పథకాలకు ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మండలానికి ఒక గ్రామంలోనే నాలుగు పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. మిగతా గ్రామాల ప్రజలు కాంగ్రెస్కు ఓట్లేయలేదా? అని మండిపడ్డారు. ప్రజలందరికీ లబ్ధి చేకూరుస్తామని చెప్పి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయడం ఏమిటంటూ మండిపడ్డారు.