బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్, కేంద్రమంత్రి బండి సంజయ్ ఇద్దరూ కుమ్మక్కైండ్రు. పెద్దవాళ్లు తప్పుచేసి అధికార బలంతో తప్పించుకుంటే.. రేపు ఏ ఆడబిడ్డ కూడా ఫిర్యాదు చేసే ధైర్యం చేయదు. అందుకే బండి సంజయ్‌ని కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి. -కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ ) : బాలికపై లైంగిక దాడికి పాల్పడి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరుగాలంటే.. తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘బేటీ పడావో.. బేటీ బచావో’ అని చెప్పే మాటలు కేవలం నినాదాలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని హితవు పలికారు. భారతదేశ చరిత్రలోనే ఒక కేంద్ర మంత్రి కొడుకుపై లుకౌట్ నోటీసులు జారీ చేసే దుస్థితి రావడం దేశానికే
అవమానకరమని మండిపడ్డారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ‘ నా బూత్ -నా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ బీఎల్ఏలకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో కేటీఆర్ మాట్లాడారు. తప్పుచేసిన తన కొడుకు భగీరథ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ తొమ్మిది రోజుల పాటు ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం తెలంగాణకే కాదు, దేశానికే సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి పదవిలో బండి సంజయ్ కొనసాగితే ఇకడ విచారణ సజావుగా సాగే పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే.. స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగి బాధిత బాలిక తల్లిదండ్రులను పిలిపించి, బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారని వాపోయారు.
రేవంత్, బండి సంజయ్ కుమ్మకు
ఒక బాలికకు అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వం మిన్నకుండిపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయని మండిపడ్డారు. ఇంతటి తీవ్రమైన పోక్సో కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమ్మకయ్యారని విమర్శించారు. ఈ దారుణాన్ని ‘హనీట్రాప్ ’గా చిత్రీకరిస్తూ మీడియాను ‘మనీట్రాప్’లోకి లాగి, వార్తలు రాకుండా గొంతు నొకేందుకు ఇద్దరూ విఫలయత్నం చేశారని ధ్వజమెత్తారు. పెద్దవాళ్లు తప్పుచేసి అధికార బలంతో తప్పించుకుంటే రేపు ఏ ఆడబిడ్డ కూడా బయటకు వచ్చి ఫిర్యాదు చేసే ధైర్యం చేయదని, అందుకే బండి సంజయ్‌ని వెంటనే పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండ
కేంద్ర మంత్రి ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా, బెదిరించినా లొంగకుండా నిందితుడిపై పోరాటం చేసిన బాధిత బాలిక తల్లిదండ్రుల ధైర్యాన్ని కేటీఆర్ అభినందించారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కలిసి అన్యాయం చేయాలని చూసినా ఆ కుటుంబం వెనుకడుగు వేయలేదని చెప్పారు. బీఆర్ఎస్, అనుబంధ సంఘాల పోరాటం వల్లే బాలికకు కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చిందనని తెలిపారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ మహిళా విభాగం కాళికాదేవిలా మారి అండగా నిలిచిందని, మహిళా కమిషన్, డీజీపీని కలిసి నిలదీసిందని గుర్తుచేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, మహిళా నాయకులు, విద్యార్థి సంఘాలు, సోషల్ మీడియా వారియర్స్ చేసిన ఉధృత పోరాటం వల్లే ఇవాళ నిందితుడు అరెస్ట్, లొంగుబాటు అయ్యే పరిస్థితి వచ్చిందని, బాధిత బాలికకు కొంత న్యాయం జరిగే మార్గం దొరికిందని పేరొన్నారు.