రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ (ఆర్ఎస్) బ్రదర్స్ బంధం ఫెవికాల్ బంధంలా మరింత గట్టిగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ విమర్శించారు. రేవంత్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ సహాయ మంత్రిగా మారారని ఆరోపించారు. లగిచర్లలో గిరిజన రైతులను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై సంజయ్ ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడుతూ.. సొంత పార్టీ ఎంపీ డీకే అరుణను లగిచర్ల గ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే సంజయ్ ఎందుకు మాట్లాడలేదు? లగిచర్లలో గిరిజన రైతులను అరెస్టు చేస్తే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ కలిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారని కేపీ వివేకానంద మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపర్చాలనే ఉద్దేశంతో ఆయన కుటుంబంపై బీఆర్ఎస్, బీజేపీ బురదచల్లుతున్నారని మండిపడ్డారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ బంధాన్ని బీఆర్ఎస్ అనేకమార్లు నిరూపించిందని చెప్పారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి 11 నెలలుగా ఆటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తన మార్కు ఒక్క మంచి పని కూడా చేయలేకపోయారని ఫైరయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒకటి అయ్యాయని, రేవంత్, సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్‌లాగా పని చేస్తున్నారని కేపీ వివేకానంద విమర్శించారు. కొడంగల్ అగ్నిగుండంగా మారితే సంజయ్ ఎక్కడ నిద్రపోయారు? ముఖం ఎక్కడ పెట్టుకున్నారు? అని నిలదీశారు. కేటీఆర్ బామ్మర్ది గృహ ప్రవేశ ఘటనపై తనకు నెట్వర్క్ ఉన్నదని తక్షణమే స్పందించిన సంజయ్‌కి నెట్ లేదు వర్క్ లేదు వర్త్ లేదు.. అని ఎద్దేవాచేశారు. కేటీఆర్‌ను వ్యక్తిగతంగా రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. సొంత అల్లుడి కోసం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో రైతుల భూములు లాకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ అగ్నిగుండంలా మారుస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పోలీసులను తన ప్రైవేటు సైన్యంలా వాడుకుంటున్నారని విమర్శించారు. లగిచర్ల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని, అధికారులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపించారు. పార్టీలకు అతీతంగా భూములు ఇవ్వబోమని రైతులు తిరుగుబాటు చేశారని చెప్పారు.