Amit Shah | ఖమ్మం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా భద్రాచలం పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఆదివారం తొలుత ఢిల్లీ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి ఏపీలోని విజయవాడకు చేరుకుని.. అక్కడి నుంచి భద్రాచలం వచ్చి సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకునేలా షెడ్యూలు ఖరారైంది. కానీ శనివారం సాయంత్రం అమిత్ షా టూర్ షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. భద్రచాలం పర్యటన రద్దయినట్లు శనివారం సాయంత్రం యంత్రాంగం ప్రకటించింది. కేవలం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు మాత్రమే కేంద్ర మంత్రి హాజరవుతున్నట్లు ప్రకటన వెలువడింది.
తాజాగా విడుదలైన అధికారిక షెడ్యూల్ ప్రకారం.. కేంద్ర అమిత్షా ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయల్దేరి విజయవాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అదే హెలికాఫ్టర్లో విజయవాడకు తిరుగు ప్రయాణమై అక్కడి నుంచి ఢిల్లీకి వెళతారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు కూడా నిరాశకు గురయ్యారు. గతంలో రెండుసార్లు అమిత్షా ఖమ్మం పర్యటన వాయిదా పడింది. మూడోసారి పర్యటన ఖరారై కూడా భద్రాచలం పర్యటన రద్దుకావడంపై ఆ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తుండడం గమనార్హం. భద్రాచలంలో గోదావరిపై రెండో బ్రిడ్జి పనులు, ఏటా వరద ముంపు, కొవ్వూరు రైల్వేలైన్, రాష్ట్ర విభజన హామీలు, విలీన మండలాలు, విలీన పంచాయతీల సమస్యలను ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉండటంతోనే అమిత్ షా పర్యటనను రద్దు చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.