హైదరాబాద్/ఖైరతాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కంపెనీకి కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. టీటీడీకి నెయ్యిని సరఫరా చేసిన నాలుగు కంపెనీల నమూనాలు వచ్చాయని, వీటిలో ఓ కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీని గుర్తించినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే చెప్పారు. తిరుపతి లడ్డు ప్రసాదం అంశాన్ని రాజకీయంగా వాడుకునే అధ్వానస్థితిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూలైలో వచ్చిన నివేదికను చంద్రబాబు సెప్టెంబర్‌లో తన పార్టీ కార్యాలయంలో పెట్టి వివాదాన్ని రాజేశారని తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాకే నెయ్యి పంపిణీ జరిగిందని, దానికి బాధ్యత చంద్రబాబే వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తిరుమల లడ్డూ విషయంలో తప్పు జరిగి ఉంటే సర్వనాశనం అయిపోతామని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సోమవారం తిరుమలలో ప్రమాణం చేశారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. మరోవైపు తిరుపతి లడ్డూ విషయంలో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
లడ్డూపై అనుమానాలొద్దు: టీటీడీ
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సంప్రోక్షణ చర్యల్లో భాగంగా దోష నివారణ ఆలయ యాగశాలలో శాంతి హోమం, లడ్డూపోటు, విక్రయశాలలో పూర్ణాహుతి నిర్వహించినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం వెల్లడించారు. పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని, భక్తులెవరూ ఆందోళన చెందవద్దని ఆలయ ప్రధానార్చకుడు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని, లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలొద్దని చెప్పారు.