Nirmala Sitaraman | హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీతో రైతులు అటూఇటూ కాకుండా పోయారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సగం మందికే రుణమాఫీ అమలు చేసిందని బీఆర్ఎస్ రా జ్యసభ సభ్యుడు వద్దిరాజు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచనల ఆరోపణలు చేశారు. బుధవారం రాజ్యసభలో బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్లుపై జరిగిన చర్చలో సీతారామన్ మాట్లాడారు. తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. రైతులందరికీ ప్రయోజనం దక్కకపోయినా ప్రభు త్వం మాత్రం అందరికీ మాఫీ చేసినట్టు గొ ప్పలకుపోయిందని విమర్శించారు.
ప్రభుత్వ ప్రకటనను బ్యాంకులు పరిగణనలోకి తీసుకొని వన్‌టైం సెటిల్మెంట్ కింద రుణాలను రద్దు చేస్తున్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. వన్‌టైం సెటిట్మెంట్తో రైతులు కొత్త రుణాలు తీసుకునేందుకు అర్హత కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బ్యాంకు రుణాలు అందక రైతులు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం రైతులకు మేలు చేయకపోగా.. నష్టం చేస్తున్నదని ఆ గ్రహం వ్యక్తం చేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుచేసిన రుణమాఫీ కారణంగా, ఆ తర్వాత రైతులకు కొత్త రుణాలు అందని పరిస్థితి నెలకొన్నదని గుర్తుచేశారు.