ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్టు గత ఏప్రిల్‌లో మోదీ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురీ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ రిఫైనరీ విలువ రూ.80 వేల కోట్లు. దాని వల్ల లభించే ఉద్యోగాలు 40 వేలు! తెలంగాణలో రిఫైనరీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. ఏపీకి రిఫైనరీ ఇచ్చిన విషయం తెలిసీ.. ‘ఏపీకే ఎందుకిచ్చారు? తెలంగాణ సంగతి ఏమిటి?’ అని రాష్ట్ర అధికారులు అడిగారు. దానికి మోదీ సర్కారు చెప్పిన జవాబు.. ‘ఏపీకి సముద్రతీర ప్రాంతం ఉంది. రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ఎకోసిస్టమ్ ఉంది. తెలంగాణలో అది లేదు!’ అని. ఓకే రైట్! కొంచంసేపు ఇది నిజమేనని అనుకుందాం!
మోదీ ప్రభుత్వం మొన్ననే నాలుగు సెమీ కండక్టర్ పరిశ్రమలకు అనుమతులు మంజూరుచేసింది. ఒడిశాకు రెండు, ఏపీ, పంజాబ్‌కు ఒక్కొక్కటి చొప్పున వీటిని కేటాయించింది. తెలంగాణకు ఒక్కటి కూడా దక్కలేదు. దేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు అత్యంత అనువైన ఎకోసిస్టమ్ ఉన్న నగరాలు రెండే రెండు. ఒకటి బెంగళూరు.. రెండోది హైదరాబాద్! మౌలిక సదుపాయాలు, కేసీఆర్ సర్కారు రూపొందించిన అనుమతుల విధానం.. ఇలా ఏ రకంగా చూసుకున్నా సెమీకండక్టర్ పరిశ్రమకు అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉన్నది హైదరాబాద్‌లోనే. అయినా సరే మోదీ సర్కారు హైదరాబాద్‌కు ఒక్క పరిశ్రమనూ ఇవ్వలేదు. మరి ఏపీకి రిఫైనరీ ఇవ్వడానికి పనికొచ్చిన ఎకోసిస్టమ్ ప్రాతిపదిక, హైదరాబాద్‌కు సెమీకండక్టర్ పరిశ్రమ కేటాయించడానికి ఎందుకు పనికిరాలేదు? ఏ ఎకో సిస్టమ్ లేని ఒడిశా, అసోం, ఏపీ, పంజాబ్‌లకు పరిశ్రమలను ఎలా కేటాయించారు?
తెలంగాణ అంటేనే కడుపులో కత్తులు పెట్టుకున్నట్టు, కండ్లల్లో కక్ష నింపుకొన్నట్టు వ్యవహరించే మోదీ-బాబు ద్వయం.. రాష్ర్టానికి కొత్తవి ఇవ్వకపోగా, ఉన్నవాటినీ ఎట్ల ఎగరేసుకు పోదామా..? అని ఎదురుచూస్తూనే ఉన్నది. రాష్ర్టానికి సెమీకండక్టర్ పరిశ్రమలేవీ ఇవ్వకపోగా.. రావాల్సిన అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ (ఏఎస్ఐపీ) పరిశ్రమనూ ఎత్తగొట్టారు. ఏపీకి ఎత్తుకుపోయారు. ఇదీ ప్రస్తుతం తెలంగాణ దురవస్థ. కొత్తవి రాకపోగా, ఉన్నవాటినీ కాపాడుకోలేని దౌర్భాగ్యమిది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పారిశ్రామిక వైభవమేమిటి? పెట్టుబడుల వైభోగమేమిటి? అన్ని రాష్ర్టాలూ ఆశ్చర్యపోయి చూస్తుంటే.. తెలంగాణను పరిశ్రమల డెస్టినేషన్‌గా మార్చిన కేటీఆర్ కృషి ఏమిటి? పెట్టుబడుల ముచ్చట వినని రోజేదైనా ఉండెనా? ఇవ్వాళ పరిస్థితి ఏంది? ఉన్న పరిశ్రమలూ రాష్ట్రం దాటుతుంటే చేతులు ముడుచుకొని కాంగ్రెస్ సర్కారు.. చేష్టలుడిగిన బీజేపీ ఎంపీలు చూసుడే తప్ప, చేస్తున్నదేమిటి?
హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): ఎందుకంటే ఇక్కడ పరిశ్రమల కేటాయింపునకు ప్రాతిపదిక ఎకో సిస్టమ్ కాదు; తెలంగాణపై బీజేపీ పగ, చంద్రబాబు చేస్తున్న దగా! ఎందుకంటే సెమీ కండక్టర్ పరిశ్రమకు ఒడిశాలోగానీ, అసోంలోగానీ ఎటువంటి ఎకో సిస్టమ్ లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి అంటారా? తాజాగా కేంద్రం ఆ రాష్ర్టానికి సెమీకండక్టర్ పరిశ్రమనైతే కేటాయించింది. కానీ, అది ఎక్కడ ఏర్పాటుచేస్తారో ఎవరికీ తెల్వదు. ఎందుకంటే సెమీకండక్టర్ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయించుకోలేదు. దానికి స్థలాన్ని కూడా కేటాయించలేదని ఆ రాష్ట్ర అధికార వర్గాలే చెప్తున్నాయి.
మరి పాలసీయే లేకున్నా, స్థల నిర్ణయమే జరగకున్నా ఏపీకి మోదీ సర్కారు సెమీకండక్టర్ యూనిట్‌ను ఎందుకు కేటాయించింది? అసలు కథ అంతా ఇక్కడే ఉన్నది. తెలంగాణపై పగబట్టిన మోదీ ప్రభుత్వం, మోదీ సర్కారు మనుగడలో కీలకపాత్ర పోషిస్తున్న తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కలిసి తెలంగాణలో ఏర్పాటుచేయాలనుకున్న సెమీకండక్టర్ పరిశ్రమను ఏపీకి ఎత్తుకు పోయినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. పరిశ్రమ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం… అడ్వాన్స్సిస్టమ్ ఇన్ ప్యాకేజ్(ఏఎస్ఐపీ) టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ హైదరాబాద్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుచేయాలని భావించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.500 కోట్లు (468)కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయాలని అనుకుంది.
ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు ప్రారంభించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు మహేశ్వరంలో 10 ఎకరాల స్థలాన్ని, రాష్ట్రం తరఫున ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలను కేటాయించాలని కూడా పరిశ్రమల శాఖ భావించింది. ఈ విషయం తెలియగానే కుట్రల పర్వం మొదలైంది. ఈ పరిశ్రమను ఎలాగైనా ఏపీకి తరలించుకుపోవాలనే పన్నాగాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఏపీ పాలక పార్టీ పెద్దల నుంచి కేంద్రంపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. అసలే తెలంగాణపై కక్షతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇదే అదనుగా రంగంలోకి దిగింది.
కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఉన్నతాధికారి సదరు కంపెనీ ప్రతినిధులతో మాటా మంతి ప్రారంభించారు. “తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుచేస్తే ఏమొస్తుంది. మీరు ఏపీలో పెట్టండి. మేం వెంటనే అనుమతులు మంజూరు చేస్తాం’ అని ఆయన సూచించారు. అయినా ఆ కంపెనీ యాజమాన్యం హైదరాబాద్ వైపే మొగ్గుచూపింది. దీంతో కేంద్ర పెద్దలు దండోపాయం ప్రయోగించారు. ‘మీరు మీ యూనిట్‌ని ఏపీలో పెడితేనే మేం అనుమతులిస్తాం. అప్పుడే మీకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ వస్తుంది. కాదని హైదరాబాద్‌కే వెళ్తామంటే మీ ఇష్టం’ అని వారు బెదిరింపులకు దిగారు. అసలు విషయం ఏమిటంటే కేంద్రప్రభుత్వం తెచ్చిన సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ స్కీం ప్రకారం.. ఈ పరిశ్రమ ఏర్పాటు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం వరకు ఫిస్కల్ సపోర్ట్ అందజేస్తుంది.
అలాగే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు మరో 25 శాతం ఫిస్కల్ సపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. అంటే 500 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటే అందులో 250 కోట్లు కేంద్రం నుంచి, మరో 125 కోట్లు రాష్ట్రం నుంచి అందే అవకాశం ఉంది. యాజమాన్యం 25 శాతం భరిస్తే సరిపోతుందన్నమాట. కేంద్రం యూనిట్‌ను ఏపీలో పెట్టమంటున్నదనీ, ఏం చేయాలని ఏఎస్ఐపీ యాజమాన్యం ప్రతినిధులు రాష్ట్ర అధికారులను ఆరా తీశారు. కేంద్రం అనుమతి లేకుండా పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే 50 శాతం ఫిస్కల్ సపోర్ట్ కంపెనీ వదులుకోవాలి. లేదా ఆ మేరకు రాష్ట్రం నుంచి మద్దతు తీసుకోవాలి.
కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర అధికారులను దీని గురించే ఆరా తీశారు. “అసలే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉంది. కేంద్రం సబ్సిడీ ఇవ్వకుంటే ఆ మేరకు మేం సపోర్ట్ చేసే పరిస్థితి లేదు” అని అధికారులు చేతులెత్తేశారు. దీంతో సదరు కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో, ఇష్టం లేకున్నా ఏపీలో యూనిట్ పెట్టడానికి అంగీకరించింది. ఏపీ సర్కారుతో అంతకుముందు వరకు చర్చలే జరగకున్నా, పరిశ్రమ పెట్టేందుకు సదరు కంపెనీ దరఖాస్తే చేయకున్నా, అక్కడ ఆ కంపెనీకి ఇంతవరకు ఇంచు భూమి కూడా కేటాయించకపోయినా… కేంద్రం ఆ పరిశ్రమను ఏపీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు తానిచ్చే సబ్సిడీతో కంపెనీని బ్లాక్మెయిల్ చేసింది.
తెలంగాణపై చంద్రబాబు పగ ఏ స్థాయిలో ఉందో, కేంద్రం ఎంత దగా చేస్తున్నదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ అనుమతులు, రాయితీలు, భూమి అన్నీ వసతులు కల్పించిన సంస్థను.. అన్నీ వదిలేసుకుని పక్క రాష్ర్టానికి తరలిపోయేలా చేయగలిగిందంటే కేంద్రం ఏ స్థాయిలో తన వ్యవస్థలను ఉపయోగించి బెదిరించిందో అర్థమవుతున్నది. తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో మొత్తానికి మొత్తం లోక్‌సభ సీట్లను కాంగ్రెస్, బీజేపీలకు కట్టబెట్టారు. రెండు పార్టీల నుంచి ఎనిమిదేసి మంది లోక్‌సభ సభ్యులు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బీజేపీ ఎంపీల్లో ఇద్దరు కేంద్ర మంత్రులుగా వెలగబెడుతున్నారు. అయినా మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల ద్రోహపూరితంగా అన్యాయం చేస్తుంటే ఒక్కరు కూడా కిక్కురుమనడం లేదు. తెలంగాణకు రావాల్సిన సెమీకండక్టర్ పరిశ్రమను ఏపీకి కేటాయిస్తూ మోదీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే, అదే క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న బీజేపీ మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దాన్ని అడ్డుకునే ప్రయత్నమైనా చేయలేవు. మా పరిశ్రమను ఏపీకి ఎట్లా తరలిస్తారని కనీసం ప్రశ్నించలేదు.
ఇక రేవంత్‌రెడ్డి సర్కారు సంగతి సరేసరి. బడేభాయ్ ఛోటేభాయ్ అంటూ ప్రధాని మోదీ ముందు సాగిలపడుతున్న సీఎం రేవంత్‌గానీ, గొప్పగొప్ప ప్రకటనలు చేస్తున్న పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబుగానీ, పరిశ్రమలశాఖలో సుదీర్ఘ కాలం పని చేసి ప్రస్తుతం సీఎంవోలో ఉన్న సీనియర్ బ్యూరోక్రాట్ జయేశ్రంజన్గానీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులుగానీ తెలంగాణ పరిశ్రమ ఏపీకి తరలిపోకుండా ఆపడంలో విఫలమయ్యారు. చంద్రబాబుకు సాగిల పడి తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ సర్కారు దెబ్బతీస్తున్నదనడానికి ఇంతకంటే నిదర్శనం వేరే అక్కర్లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. “సెమీకండక్టర్ల రంగంలో దేశం స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో కేంద్రం ఇండియా సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం)ను ఏర్పాటుచేసింది.
ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటివరకు దేశంలో 10 ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. అందులో ఇంతవరకు తెలంగాణకు చోటు దక్కలేదు. ఇవ్వాల్సిన మోదీ సర్కారు ఇవ్వదు. తేవాల్సిన రేవంత్ సర్కారు తేదు. మన హైదరాబాద్‌లో యూనిట్ పెడతానని ముందుకొచ్చిన వారిని ఏపీ గద్దలా తన్నుకుపోతుంటే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడడు. ఇంతకంటే దారుణం ఏముంటుంది?”అని ఒక పారిశ్రామిక వేత్త అసహనం వ్యక్తంచేశారు. “సుమీ కండక్టర్ పరిశ్రమను మంజూరు చేయకపోవడం వల్ల తెలంగాణ కోల్పోయింది రూ.500 కోట్ల పెట్టుబడి ఒక్కటే కాదు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 3 వేల ఉద్యోగావకాశాలూ రాష్ర్టానికి దక్కకుండా పోయాయి. మరీ ముఖ్యంగా సెమీకండక్టర్ పరిశ్రమలన్నీ ఇతర రాష్ర్టాలకు వెళ్తే.. మన రాష్ట్రంలోని నైపుణ్యం కూడా వలసవెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
టాలెంట్ తరలిపోవడం అత్యంత ప్రమాదకర సంకేతమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఒక్కసారి నిపుణుల వలస ప్రారంభమైతే, మన రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులు కూడా రావని, భవిష్యత్తులో మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అనువైన వాతావరణంతోపాటు రాష్ట్రంలో నైపుణ్యం విస్తారంగా అందుబాటులో ఉండటం కూడా తెలంగాణకు పెట్టుబడులు తరలిరావడానికి ఓ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో అనుకూల విధానాలు, ప్రతిభగల మానవ వనరులు ఉండడంతో అనేక అంతర్జాతీయస్థాయి ఐటీ కంపెనీలు రాష్ర్టానికి వచ్చాయి. మన రాష్ట్రంలోని ఐటీ నిపుణులే కాకుండా ఇతర రాష్ర్టాలనుంచీ ఎంతోమంది రాష్ర్టానికి వచ్చారు. ఇప్పుడు మన పిల్లలు ఇతర రాష్ర్టాలకు వలస పోవాల్సిన పరిస్థితిని బీజేపీ, కాంగ్రెస్‌లు కల్పిస్తున్నాయి” అని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ కోసం ఓ ప్రముఖ కంపెనీ దరఖాస్తు చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలనే షరతుపై ఆ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించింది. గతంలోనూ తెలంగాణకు రావాల్సిన రెండు ప్రాజెక్టులను బలవంతంగా గుజరాత్‌కు తరలించింది. రాష్ర్టాల మధ్య పోటీ.. భారత్‌ను దృఢంగా మార్చుతుందని ప్రధాని నరేంద్రమోదీ పదేపదే చెప్తుంటారు. కానీ అంపైరే స్పష్టంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంటే.. ఇక పోటీ ఎందుకు?
– జైరామ్ రమేశ్, రాజ్యసభ సభ్యుడు(కాంగ్రెస్)
ప్రపంచంలోని ప్రధాన ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఉన్న తెలంగాణ రాష్ర్టానికి సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి. అంతేకాదు, దేశంలోని మరే ఇతర రాష్ర్టానికి లేనంత సెమీకండక్టర్ ఎకోసిస్టం మన రాష్ట్రంలో ఉందనడంలో సందేహం లేదు. అమెరికాకు చెందిన ఇంటెల్, క్వాల్కమ్ కంపెనీలు ప్రాసెసర్లను అభివృద్ధి చేస్తుండగా.. మైక్రోచిప్ టెక్నాలజీ ఇంక్ సంస్థ మైక్రో ప్రాసెసర్లు, మైక్రో కంట్రోలర్లను ఉపయోగించి విస్తృతశ్రేణి ఎంబెడెడ్ కంట్రోల్ సొల్యూషన్స్‌ను అందిస్తున్నది. అలాగే, జర్మనీకి చెందిన ఇన్ఫినియస్ టెక్నాలజీ సంస్థ సెమీకండక్టర్ మరియు హార్డ్‌వేర్ డిజైన్లను రూపొందిస్తుండగా.. టెస్సోల్వ్ కంపెనీ సెమీకండక్టర్లకు సంబంధించిన ప్రీ మరియు పోస్ట్ సిలికాన్ సేవలను అందిస్తున్నది. మైక్రాస్ టెక్నాలజీ సంస్థ కంప్యూటర్ మెమరీ మరియు డాటా నిల్వ పరిష్కారాలను అందిస్తున్నది.
మోస్చిప్ సంస్థ హార్డ్‌వేర్ నైపుణ్యం టెలికం, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్ తదితర రంగాలకు అవసరమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి తోడ్పడుతున్నది. మిరాఫ్రా టెక్నాలజీ సెమీకండక్టర్ల డిజైన్ సేవలను అందిస్తుండగా, ఏఎండీ సంస్థ అంతర్గత ప్రాసెసర్లు, గ్రాఫిక్ కార్డులు, అడాప్టివ్ సిస్టమ్స్ ఆన్ చిప్స్‌లను అభివృద్ధి చేస్తున్నది. ఎన్విడియా అధునాతన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేస్తున్నది. ఇందులో సింహభాగం కంపెనీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో కొలువుదీరాయి. ఇన్ని బహుళజాతి కంపెనీలు ఉండటం వల్ల తెలంగాణ సెమీకండక్టర్ల పరిశ్రమకు దేశంలోనే అత్యంత అనుకూల ప్రాంతం. అయినా తెలంగాణకు సెమికండక్టర్ పరిశ్రమలు రాకుండా కేంద్రం కుట్రలు చేయడం, వస్తున్న పరిశ్రమలు మోకాలడ్డడం.. 8మంది ఎంపీలను గెలిపించిన రాష్ట్ర ప్రజలను వంచించడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్‌లకు చెరో 8మంది ఎంపీలున్నారు.
ఇద్దరు కేంద్రమంత్రులు! అయినా రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదు. కొత్త ప్రాజెక్టులు రప్పించలేరు. వచ్చేవి పోతుంటే ఆపలేరు. సొంత ప్రాంతానికి తమ పార్టీయే అన్యాయం చేస్తుంటే.. నోరుమెదపలేని దురవస్థ వారిది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి మాటలకు తలాడిస్తున్న కేంద్రం.. సొంత ఎంపీలను, వారిని గెలిపించిన తెలంగాణ ప్రజల్ని మాత్రం లెక్కచేయడం లేదు. బనకచర్ల మొదలుకొని.. సెమికండక్టర్ల దాకా తెలంగాణ ప్రయోజనాలకు అడుగడుగునా బాబు అడ్డుపడుతున్నా కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీసం మాటైనా మాట్లాడకపోవడం దారుణం” అని సీనియర్ బీఆర్ఎస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
“బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల మంత్రిగా ఉన్న కేటీఆర్, కేంద్రం సహకరించకపోయినా అనేక జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను విజయవంతంగా సాధించారు. యాపిల్ ఐఫోన్లు తయారుచేసే ఫాక్స్‌కాన్ కంపెనీని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇతర రాష్ర్టాలనుంచి ఎంత పోటీ ఎదురైనా, తలొగ్గకుండా కంపెనీ కోరిన విధంగా భూములు కేటాయించి, రాయితీలు కల్పించి కొంగరకలాన్ వద్ద పరిశ్రమను ఏర్పాటుచేశారు. రెండేండ్లుగా తెలంగాణలో పెట్టుబడులు జోరుతగ్గింది. కొత్త సంస్థలు రావడమే లేదు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాష్ర్టానికి పెట్టుబడులు రాబట్టేందుకు కృషిచేయకున్నా.. కనీసం జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎందుకు ప్రశ్నించడంలేదు” అని సీనియర్ పాత్రికేయుడొకరు ప్రశ్నించారు.