
Union Budget | ‘తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, రాష్ట్రం హక్కులు పరిరక్షించాలన్నా.. ఢిల్లీ మెడలు వంచి నిధులు తేవాలన్నా, నదుల నీళ్లలో మన వాటా మనకు దక్కాలన్నా.. సింగరేణి ప్రైవేటుపరం కావొద్దన్నా.. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరమున్నది. ప్రజలుగా మీరిచ్చే బలమే నా బలం. పైన కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. అది ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరమొస్తది. బీఆర్ఎస్ను గెలిపిస్తే తెలంగాణకు కావాల్సినన్ని నిధులు బాజాప్తా తెచ్చుకోవచ్చు’… ఎంపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ జిల్లా జిల్లా తిరిగి చెప్పిన మాట ఇది. ఇవ్వాళ్టి కేంద్ర బడ్జెట్‌ను చూస్తే ఈ మాటలెంత సత్యమో అర్థమవుతున్నది.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే.. ఒక పార్టీ ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి పదవులు తెచ్చుకున్నది! మరోపార్టీ ఢిల్లీకి కప్పం కడుతున్నది! మరి తెలంగాణకు ఒరిగిందేంది?
48 లక్షల కోట్ల బడ్జెట్లో నాలుగు పైసలు రాలె! 92 నిమిషాల నిర్మల ప్రసంగంలో ఒక్కసారైనా ‘తెలంగాణ’ పేరు వినపడలె! ఉమ్మడి రాష్ట్రంలో ఒకాయన అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధిస్తే.. ఆయన మద్దతుతో కేంద్రంలో నిలబడిన ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో ‘తెలంగాణ’ పదం లేకుండా చేసింది.
దేశాన్ని సాకుతున్న రాష్ర్టాల్లో ముందున్న తెలంగాణ.. ఇప్పుడు ఢిల్లీలో ఎవరికీ పట్టని ఓ అనాథ! ఇక్కడినుంచి ఎన్నికై సభలో కూర్చున్న ఎంపీలు మూగ ప్రేక్షకులు! నిర్మల పద్దులో నిర్లక్ష్యంపై పంజాబ్ వాళ్లు గొంతెత్తారు. కర్ణాటక వాళ్లు కత్తులు నూరారు. బెంగాల్ వాళ్లు గర్జించారు. కానీ తెలంగాణ గొంతుకలే సభ లోపలా బయటా పెగలలేదు. ప్రాంతీయ పార్టీలను గెలిపించుకున్న రాష్ర్టాలు కొమ్ములు విసిరి నిధులు మళ్లించుకుంటుంటే మన జాతీయపార్టీ ప్రతినిధులు అధిష్ఠానాలముందు తలవంచుకు తిరుగుతున్నారు. పోలవరంతో దేశానికి ఆంధ్రా ఆహార భద్రత ఇస్తుందని నిర్మలమ్మ చెప్తే, మరి దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన అన్నపూర్ణ తెలంగాణ సంగతేమిటని అడిగె దిక్కు లేకపోయింది.
ఇదేమని నిలదీసే ఇంటి పార్టీ లేని లోటు వెక్కిరిస్తుంటే.. తెలంగాణకు ‘రిక్తహస్త ప్రణాళిక’ను కేంద్రం తన బడ్జెట్ ద్వారా ప్రకటించింది. ఇప్పుడొకటే ప్రశ్న! ఈ జాతీయపార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమిటి? ఉత్సవ విగ్రహాల వంటి ఆ పార్టీ ప్రతినిధులతో ఒనగూరేదేమిటి?
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాజధాని అమరావతి నిర్మాణం సహా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రం బడ్జెట్లో చోటు కల్పించింది. రాష్ట్ర రాజధాని అవసరాన్ని తాము గుర్తించామని, ఇందుకోసం బహుముఖ అభివృద్ధి సంస్థల ద్వారా ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజధాని నిర్మాణానికి రూ.15,000 కోట్లు, రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
పారిశ్రామిక అభివృద్ధికి నిధులు
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి బడ్జెట్లో కేంద్రం ప్రాధాన్యతనిచ్చింది. హైదరాబాద్ – బెంగళూరు, విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని బడ్జెట్లో పొందుపరిచింది. కొప్పర్తి, ఓర్వకల్లులో పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి అవసరమైన నీటి వసతులు, విద్యుత్తు, రైల్వే, రోడ్ల నిర్మాణానికు నిధులు మంజూరు చేస్తామని నిర్మలా సీతారమన్ ప్రకటించారు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తామని చెప్పారు. తూర్పు రాష్ర్టాల అభివృద్ధి కోసం కేంద్రం కొత్తగా ప్రారంభించిన పూర్వోదయ ప్రాజెక్టులోనూ ఆంధ్రప్రదేశ్‌ను భాగం చేసింది.
కేంద్ర బడ్జెట్లో బీహార్ రాష్ట్రంపై బీజేపీ సర్కారు వరాల జల్లు కురిపించింది. బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ ఎంపీల మద్దతుపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ర్టానికి నిధుల వరద పారించింది. తెలంగాణ సహా అనేక రాష్ర్టాల పేర్ల ప్రస్తావన కూడా లేని బడ్జెట్లో బీహార్‌కు మాత్రం కేటాయింపుల్లో కేంద్రం ప్రాధాన్యతను ఇచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ర్టానికి అనేక ప్రాజెక్టులు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తన రాష్ర్టానికి భారీగా నిధులు తీసుకురావడంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ విజయవంతమయ్యారు.
రోడ్లకు రూ.26,000 కోట్లు
బీహార్‌లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. పట్నా – పుర్ణియా, బక్సర్ – భాగల్పూర్ జాతీయ రహదారులు, బోధ్‌గయా – రాజ్‌గిర్ – వైశాలి – దర్భంగ ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్ వద్ద గంగానదిపై కొత్తగా రెండు లేన్ల వంతెన నిర్మాణం వంటి పనులకు బడ్జెట్లో ఏకంగా రూ.26,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
21,400 కోట్లతో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం
బీహార్‌లో వరద నివారణ పనుల కోసం రూ.11,500 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిధులతో బ్యారేజీలు, నదుల్లో కాలుష్య నివారణ పనులు, నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టనుంది. రాష్ట్రంలో పిర్పైంటిలో 2400 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి రూ.21,400 కోట్లు కేటాయించారు.
ప్రపంచ స్థాయికి విష్ణుపాద్, మహాబోధి ఆలయాలు
బీహార్‌లోని విష్ణుపాద్, మహాబోధి ఆలయాలను ప్రపంచ స్థాయి తీర్థయాత్ర, పర్యాటక గమ్య స్థానాలుగా తీర్చిదిద్దుతామని నిర్మల పేర్కొన్నారు. విష్ణుపాద్ ఆలయం ప్రాచీన హిందూ ఆలయం కాగా, బౌద్ధ మతానికి చెందిన మహాబోధి ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఈ రెండు ఆలయాల కారిడార్లను కాశీ విశ్వనాథ్ ఆలయ కారిడార్ తరహాలో అభివృద్ధి చేస్తామని నిర్మల తెలిపారు. ఇవే కాకుండా రాష్ట్రంలో కొత్తగా ఎయిర్‌పోర్టులు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను సైతం కల్పించనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బీహార్ అభివృద్ధికి వివిధ అభివృద్ధి సంస్థల నుంచి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని చెప్పారు.