హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని సర్వేనంబర్ 36, 37ల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంపై అటు సర్కారుగానీ ఇటు అధికారులుగానీ మౌనం వీడటం లేదు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు వ్యక్తులు ఆ భూములను వదలడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా న్యాయం దక్కకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. అసలు ప్రైవేటు వ్యక్తులకు ఎన్వోసీ ఇచ్చేందుకు ఆ భూములను నిషేధిత జాబితా నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలంటూ న్యాయస్థానం ఆదేశించి మూడు నెలలు దాటింది! కానీ ఇప్పటికీ నోరు విప్పిన అధికారి లేరు. అయినా న్యాయం దక్కేవరకు ఆందోళన విరమించేదిలేదని బీటీఎన్జీవో 150 రోజులుగా భీష్మించుకు కూర్చున్నది.
ఇదీ నేపథ్యం
గోపన్‌పల్లిలోని సర్వేనంబర్ 36, 37ల్లోని 189.11 ఎకరాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఏపీ ఎన్జీవోలకు ప్రభుత్వం కేటాయించింది. దీంతోపాటు ఇతర టీఎన్జీవో, సచివాలయ, ఇతరత్రా ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూముల్లో దశాబ్దాల కిందటే ఉద్యోగులు నివాసాలు నిర్మించుకొని ఉంటున్నారు. ఏపీ ఎన్జీవోకు కేటాయించిన భూమికి సంబంధించి 2010లోనే సర్వేనంబర్ 36లో ఉన్న 142.11 ఎకరాల్లో అధికారికంగా లేఅవుట్ చేసి కోట్ల రూపాయల్ని జీహెచ్ఎంసీకి ఫీజుగా చెల్లించారు. ప్లాట్ల పంపిణీ సమయంలో ఉద్యోగుల మధ్య వచ్చిన విభేదాల కారణంగా హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం తెలంగాణ ఏర్పడటం… ఏపీ ఎన్జీవోలకు కాకుండా తెలంగాణ ఉద్యోగులకు ఆ భూములు ఇవ్వాలనే కేసీఆర్ సర్కారు నిర్ణయంతో 189.11 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. కానీ వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 2019లో ఏపీ ఎన్జీవోలోని తెలంగాణ ఉద్యోగులు భాగ్యనగర్ టీఎన్జీవోగా ఏర్పడ్డారు. గతంలో ఉద్యోగులకు కేటాయించిన భూములను కేసీఆర్ ప్రభుత్వం ముట్టుకోకపోవడంతో న్యాయపరమైన చిక్కుల తర్వాత అవి తమకే దక్కుతాయనే ధీమాతో ఉద్యోగులు ఉన్నారు.
ఈ రెండు సర్వేనంబర్లలో తమకు 91 ఎకరాల భూమి ఉన్నదని కొందరు ప్రైవేటు వ్యక్తులు సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చారు. అయితే అవి ఉద్యోగులకు ఇచ్చిన విస్తీర్ణంలో లేవని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు నివేదికలు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలు ఆ భూములపై కన్నేసి.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని 189 ఎకరాలకు ఎసరు పెట్టేందుకు పావులు కదిపారు. దీనిని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకురావడంతో భాగ్యనగర్ టీఎన్జీవో కూడా అప్రమత్తమైంది. ఇదేక్రమంలో 91 ఎకరాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ జారీచేసిన ఎన్వోసీలను సైతం ‘నమస్తే’ బయటపెట్టింది. అందులోని తిరకాసులు.. నిబంధనలకు విరుద్ధంగా చేర్చిన అంశాలు.. ప్రైవేటు వ్యక్తులకు సర్కారు భూములను ధారాదత్తం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల గుట్టు రట్టుచేసింది. ఈలోగానే ప్రభుత్వ పెద్దల అండతో ప్రైవేటు వ్యక్తులు బరితెగించి సర్వేనంబర్ 36లో దాదాపు 40 ఎకరాలకు పైగా ఆక్రమించి అక్రమ వెంచర్ చేశారు. వంద ఫీట్ల రహదారి నిర్మించారు. ఇది అక్రమం, హైకోర్టు స్టేటస్ కో ఉన్నా ఎన్వోసీలు ఇస్తున్నారంటూ ఉద్యోగులు తహసీల్దార్ మొదలు ఆర్డీవో, జిల్లా కలెక్టర్, ముఖ్య కార్యదర్శి చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం కలిసి ఫిర్యాదు చేశారు.
అఫిడవిట్ దాఖలు చేయని సర్కారు
గోపన్‌పల్లి సర్వేనంబర్ 36లోని భూముల్లో ప్రైవేటు వ్యక్తుల బరితెగింపుపై ఎట్టకేలకు హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆ సర్వేనంబర్‌లోని 17.04 ఎకరాల భూమికి సంబంధించి జారీచేసిన ఎన్వోసీలు, నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలంటూ రిజిస్ట్రేషన్‌శాఖకు రాసిన లేఖను సస్పెండ్ చేసింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఆగస్టులో రాగా.. అప్పటినుంచి పలుమార్లు కేసు విచారణ వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు తాము ఎన్వోసీ ఎందుకు జారీచేశారో, నిషేధిత జాబితా నుంచి ఎందుకు తొలగించారో అనే దానిపై కోర్టుకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంలేదు. మరి ప్రైవేటు వ్యక్తులకు ఆ భూమిని ఇవ్వడంలో సహేతుక కారణాలు ఉంటే అధికారులు ఆ విషయాన్ని ఎందుకు కోర్టుకు నివేదించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదికలకు విరుద్ధంగా ఇప్పటి అధికారులు నివేదికలు ఇవ్వడం ఒకవంతైతే… అసలు సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఉన్న పేర్లు ఎవరివి? ఇప్పుడు అధికారులు ఎన్వోసీలు ఎవరికి ఇచ్చారు? ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమి ఉద్యోగులకు ఇచ్చిన భూముల్లోనే ఉన్నాయనేందుకు ఆధారాలేమిటి? ఇలా అనేక ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం దక్కేవరకు ఆందోళన విరమించేదిలేదని, అవసరమైతే ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని భాగ్యనగర్ టీఎన్జీవో అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ స్పష్టంచేశారు.