హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘ఆశపడి మోసపోయాం.. ఇప్పుడు గోసపడుతున్నాం.. అండగా నిలవండి’ అని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుకు విజ్ఞప్తి చేశారు. యూత్ డిక్లరేషన్ల పేరిట అనేక హామీలిచ్చి మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్రజేసిన నిరుద్యోగ యువత కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరోసారి గుర్తుచేయడానికి, ప్రభుత్వం మెడలు వంచడానికి ఈ నెల 24న నిరుద్యోగ బాకీకార్డ్ ఆవిషరణ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసి ఆహ్వానలేఖ అందజేశారు. తాము ఏ పోరాటం చేసినా అది ప్రతిపక్షాల కుట్రగా అధికార పార్టీ అభివర్ణిస్తున్నది తప్ప, తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి, మంత్రులు వేలం పాడినట్టు, 40 వేలు, 60, లక్ష ఉద్యోగాలు ఇచ్చామని బహిరంగసభల్లో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి గెలిచే వరకు తమను వాడుకున్నారని, తీరా గెలిచాక ఇప్పుడు ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పోరాటానికి బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్‌రావు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించ తలపెట్టిన ‘కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు’ ఆవిషరణ కార్యక్రమానికి రావాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి ఆహ్వానం పలికారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యతతో తెలంగాణలో జరిగే ప్రతీ ప్రజా ఉద్యమానికి అండగా ఉంటామని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చేదాకా కాంగ్రెస్ సర్కార్‌ను వెంబడిస్తామని కేటీఆర్ నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు.