హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): పోలీస్‌శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, నిరుద్యోగులను ఆదుకుంటామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత నిరుద్యోగులను నమ్మించి గొంతుకోసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన విజయవంతమైందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా ఒక పోలీస్ ఉద్యోగం భర్తీ చేయలదేని విమర్శించారు. నోటిఫికేషన్లో వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలని కోరారు. అలాగే జీవో నంబర్ 46ను పూర్తిగా రద్దుచేసి, లాంగ్‌జంప్‌ను 3.8 మీటర్లకు తగ్గించాలని కోరారు. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్, కల్యాణ్, శింబునాయక్, సైదులు, లోకేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.