చిక్కడపల్లి, జూలై 25: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద శనివారం సాయంత్రం నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసులు గేటుకు తాళం వేసి అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. నిరుద్యోగ జేఏసీ నాయకులు శంకర్ నాయక్, నరేశ్, కిరణ్ తదితరులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నేతలు మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండించిన రాహుల్ గాంధీ, తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, అరెస్టులపై ఎందుకు స్పదించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఒకే ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. నీట్ పేపర్ లీక్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు, తెలంగాణలో ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని ప్రశ్నిస్తూ రాజీనామాకు డిమాండ్ చేయరా? అని నిలదీశారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.