కోహీర్, మే 16 : నిరుద్యోగ యువత ఉపాధిహామీని వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ సూచించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్, ఖానాపూర్, కొత్తూర్ గ్రామాల్లో చేపట్టిన ఈజీఎస్, వాటర్‌షెడ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ.. ఉపాధిపనులకు వస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా తీసుకురావాలని సూచించారు. పిల్లలు కూ డా ఉపాధిపనులు చేస్తే అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువత ఉదయం 10 గంటల వరకు ఉపాధి పనులుచేసి ఆ తర్వాత ఇతర ఉద్యోగాలకోసం ప్ర యత్నాలు చేసుకోవచ్చని సూచించారు. రా ష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ ఉపాధి కూలీల సంఖ్య తగ్గుతున్నదని చెప్పారు. కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 18 సబ్ స్టేషన్లల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. 18చోట్లలోని 33/11కేవీ సబ్స్టేషన్లల్లో 19 మెగావాట్ల ప్లాంట్లను నెలకొల్పడానికి 73.25 ఎకరాల స్థలం అవసరం కానున్నది. దీంతో ఉత్తర డిస్కం పరిధిలో 11, దక్షిణ డిస్కం పరిధిలో 8 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం రూ.66.50 కోట్లను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామం లో ప్లాంట్ ఏర్పాటుకు 4 ఎకరాల ప్రభు త్వ స్థలాన్ని కేటాయిస్తూ శనివారం జీవో ను జారీ చేసింది.