‘అధికారంలోకి వస్తే వందరోజుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’ ‘యూపీఎస్సీ తరహాలో రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం’ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నమ్మబలికిన మాటలివి. నిరుద్యోగులు, యువత ఆ ఉచ్చులో పడ్డారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాతే అసలు కథ మొదలైంది. గడిచిన 25 నెలల్లో యూపీఎస్సీ ఏడాదికొకటి చొప్పున 2 జాబ్ క్యాలెండర్లను ప్రకటించింది. రేవంత్ సర్కార్ మాత్రం 2024 ఆగస్టులో ఏ వివరాలూ లేని, మొక్కుబడి క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపు కొన్నది. తర్వాత కొలువుల భర్తీ లేదు, మరో జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఇదేమని ప్రశ్నించిన నిరుద్యోగలపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. వీపులు చిట్లేలా లాఠీలను ఝుళిపిస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, చిక్కడపల్లి, జనవరి 8 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఎక్కడికక్కడ ఈడ్చిపడేశారు. పోలీస్ దాడిని ప్రతిఘటించిన నిరుద్యోగులపై విచక్షణారహితంగా లాఠీలతో బాదారు. పోలీస్ వ్యాన్లలోకి తోసి పడేశారు. పోలీసుల దాడిలో పలువురికి గాయాలై.. రక్తం కారుతున్నా వారిని ఈడ్చిపడేయడం పోలీసుల దమననీతికి నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం హైదరాబాద్ నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్న నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసులు, ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. వందలాది మంది నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కార్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
శాంతియుతంగా వెళ్తున్న నిరుద్యోగులపైకి వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా లాఠీలతో విరుచుకుపడ్డారు. ఎక్కడికక్కడ కనిపించిన ప్రతివారినీ పోలీసు వ్యాన్లలో ఈడ్చిపడేశారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే అదనుగా పోలీసులు లాఠీలకు పనిజెప్పారు. నిరుద్యోగులను నిలువరించేందుకు ఎక్కడికక్కడ లాఠీలతో ఇష్టారీతిన దాడులకు దిగారు. పోలీసుల దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన వారిని వ్యాన్లలో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పిడిగుద్దులతో, దుర్భాషలాడుతూ పోలీసులు దౌర్జన్యానికి దిగారని నిరుద్యోగులు మండిపడ్డారు.

ఉద్యోగాలు ఇవ్వలేమని శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు కదం తొక్కారు. వందలాదిగా రోడ్లపైకి చేరి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. తక్షణమే ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక రూపొందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చికడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి బయలుదేరి అశోక్‌నగర్ చౌరస్తా వరకు దాదాపు 500 మందికి పైగా నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ తీరును విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎన్నికల ముందు సెంట్రల్ లైబ్రరీకి వచ్చి.. మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్న మోసం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మాయమాటలు ఆపేసి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరి మానుకొని ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు.
శాసన మండలిలో నిరుద్యోగులను తకువ చేసి మాట్లాడిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకొని తమ హక్కులను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి అరాచక పాలనను ఎండగట్టారు. అరెస్టు చేసిన నిరుద్యోగ జేఏసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని జేఏసీ నాయకులు శంకర్‌నాయక్, రవి, బాలకోటి చికడపల్లి లైబ్రరీలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలను తామే భర్తీ చేశామని అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నీటి మూటలే అయ్యాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని, హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నేతలు శంకర్‌నాయక్, కయ్య వెంకటేశ్, ఇంద్రానాయక్, రవికుమార్, బాలకోటి, రవి, మోతీలాల్, మధు గౌడ్, సంపత్, రవి రాథోడ్, భూక్యాకుమార్, ఆస్మా, కాశీనాథ్, రమేశ్, చందు తదితరులు పాల్గొన్నారు.
శాంతియుతంగా నిరసన తెలపుతున్న నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని వివిధ స్టేషన్లకు తిప్పుతూ వేధింపులకు గురిచేసినట్టు నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టయిన వారిని ముందుగా ముషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత గాంధీనగర్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నాంపల్లి స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం అదపులోకి తీసుకొన్న పోలీసులు రాత్రి వరకూ వివిధ పోలీస్స్టేషన్లకు తిప్పుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చివరికి ఆరుగురిని నాంపల్లి స్టేషన్లో బంధించారని తెలుస్తున్నది. గాంధీనగర్ పీఎస్‌లో ఒకరు, ముషీరాబాద్ పీఎస్‌లో ఒకరిని ఉంచారు. అర్ధరాత్రి దాకా తిప్పి ఆ తర్వాత వదిలి పెట్టినట్టు సమాచారం.

నల్లమల పులి అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఆయనకు దమ్మూ, ధైర్యం ఉంటే వెంటనే నోటిఫికేషన్లు విడుదల చే యాలి. మేం నోటిపికేషన్ల కోసమే ధర్నాలు చేస్తున్నాం. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఇచ్చిందో నిరూపించాలి. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడమే లేదు. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి తీరుతాం.
– గ్రూప్స్ అభ్యర్థి, రవినాయక్