Yuva Sangrama Sadassu | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నిరుద్యోగ యువత కాంగ్రెస్ సర్కార్‌పై జంగ్ సైరన్ మోగించింది. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించింది. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ప్రకటించిన మ్యానిఫెస్టోలు నీటిమూటలేనా? అని నిలదీసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు నాడు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశామని, అధికారంలోకి వచ్చాక తమకు ధోకా ఇచ్చిన రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు మళ్లీ నడుంకడుతామని ప్రతిన బూనింది. ఇచ్చిన హామీలను విస్మరించిందంటూ శనివారం నిరుద్యోగులు సరూర్‌నగర్ స్టేడియం వేదికగా చేపట్టిన ‘యువత సంగ్రామ సదస్సు’ తీవ్ర ఉతంఠ మధ్య, భారీ అడ్డంకులను అధిగమించి విజయవంతంగా ముగిసింది. అణచివేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహాలను పటాపంచలు చేస్తూ నిరుద్యోగులు భారీ ఎత్తున కదిలివచ్చారు.
యువత కాంగ్రెస్ సర్కార్‌పై జంగ్ ప్రకటించడంతో ప్రభుత్వం ఒక్కసారిగా వణికిపోయింది. ఎలాగైనా సభ జరుగకుండా చూడాలని యత్నించింది. సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు పర్మిషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. అయినా వెనక్కి తగ్గకుండా నిరుద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఎలాగైనా సభను భగ్నం చేయాలని సరార్ అడ్డంకులు సృష్టించింది. కీలక విద్యార్థి నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసింది. సభకు వచ్చే దారుల్లో ఆంక్షలు విధించింది. చివరకు సభ జరిగే సమయంలోనూ డిస్టర్బ్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, నిరుద్యోగ యువత వెనుకడుగు వేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుంచి వేలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు సరూర్‌నగర్ స్టేడియానికి తరలివచ్చారు. ప్లకార్డులు చేతబూని, తమకు జరిగిన అన్యాయాన్ని చాటారు. ఎన్నికల ముందు మీరు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? అని రాహుల్, ప్రియాంకగాంధీతోపాటు రేవంత్‌రెడ్డి తీరును నిరుద్యోగులు కడిగిపారేశారు. తమకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ సరార్‌పై భగ్గుమన్నారు.
ప్రభుత్వ నిర్బంధాలను చీల్చుకుంటూ సాగిన దండయాత్రతో సరూర్‌నగర్ స్టేడియం కికిరిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు చేసిన నినాదాలతో స్టేడియం ప్రాంగణమంతా మార్మోగింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరుద్యోగ సంగ్రామాన్ని యువత విజయవంతం చేసి, తమ సత్తా చాటింది. సభకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, బాలరాజుయాదవ్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.