హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో నిర్బంధం రాజ్యమేలుతున్నది. నిరుద్యోగ యువతపై సర్కార్ దమనకాండ కొనసాగుతున్నది. మొన్న లాఠీచార్జ్‌తో రెచ్చిపోయిన పోలీసులు.. శనివారం ఏకంగా లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులను బయటకు రానీయకుండా గేటుకు తాళాలేసి నిర్బంధించారు. ఇది నిరంకుశ పాలనకు పరాకాష్ట అని నిరుద్యోగ నేతలు, మేధావులు మండిపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని, 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన తెలిపేందుకు నిరుద్యోగులు పిలుపునిచ్చారు.
అన్నిచోట్ల రోడ్లపైకి వచ్చి ధర్నా చేయాలని తలపెట్టారు. ఈ మేరకు హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు చేపట్టనున్న నిరుద్యోగుల ర్యాలీ, మహాధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 8 గంటలకే చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో పలువురు నిరుద్యోగులను లోపలే నిర్బంధించి గేట్లకు బయట నుంచే తాళాలేసి కాపలా కాశారు.

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు చేరుకొని నిరసనలు తెలుపకుండా అడ్డుకున్నారు. జాబ్ క్యాలెండర్ హామీలను తుంగలో తొక్కిన రేవంత్‌రెడ్డి తీరును నిరసిస్తూ తాము జరుపతలపెట్టిన ర్యాలీని అడ్డుకోవడమే కాకుండా తమను అక్రమంగా లైబ్రరీలో నిర్బంధించడంపై నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లో రెండేండ్ల క్రితం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిలోగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు గుప్పించి మాట తప్పిన రేవంత్‌రెడ్డిపై నిరుద్యోగులు తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ లైబ్రరీకి స్వతహాగా వచ్చిన యువతను కూడా లోపలే నిర్బంధించడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారు మధ్యాహ్నం భోజనానికి కూడా బయటకు వెళ్లలేక అవస్థలు పడ్డారు.
మరోవైపు దిల్‌సుఖ్‌నగర్‌లో సాయంత్రం ఒక్కసారిగా నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి జాతీయ రహదారిపై బైఠాయించారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చైతన్యపురి నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీగా దిల్సుఖ్నగర్ రాజీవ్‌చౌక్‌కు చేరుకొని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకొని గప్పాలు కొడుతున్నదని ధ్వజమెత్తారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు జాతీయ రహదారిపైకి చేరుకోవడంతో ఇరువైపులా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.