చిక్కడపల్లి, సెప్టెంబర్ 6: స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో సర్కార్‌కు బుద్ధిచెప్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ‘చట్టబద్ధత గల జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలి. గ్రూప్ -2 రెండువేలు, గ్రూప్-3 మూడువేల ఉద్యోగాలు వెంటనే ప్రకటించాలి. 20 వేల పోలీస్ జాబ్స్, 7,500 జీపీవో ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం త్యాగరాయగానసభ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు కయ్య వెంకటేశ్, శంకర్ నాయక్, బాలకోటి, రవికుమార్, శ్రీను, సంపత్, మధుగౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన రాహుల్‌గాంధీ రెండేండ్లు గడుస్తున్నా తమకు ఇచ్చిన హామీలపై ఏ మాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి 54 సార్లు ఢిల్లీకి వెళ్లివచ్చినా.. సచివాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కడపల్లి నగర గ్రంథాలయం వద్ద నిరుద్యోగులతో రెండు నిమిషాలు మాట్లాడలేకపోతున్నారని దుయ్యబట్టారు.
60 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రులు, 70 వేలు, లక్ష అని మరికొందరు అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గత నెలలో సిటీ సెంట్రల్ లైబ్రరికీ వచ్చి అనేక హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆయన కూడా పత్తాలేకుండా పోయారని విమర్శించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? అని నిలదీశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలిస్తామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తరువాత మోసగించిందని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతిని అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా తమ జీవితాలతో చెలగాటమాడితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.