చిక్కడపల్లి, జూలై 1 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అశోక్‌నగర్‌లోని కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు వెంకటేశ్, కృష్ణ, నగేశ్ తదితరులు మాట్లాడుతూ.. తమకు ఇచ్చిన హామీలను అమలుచేయకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గల్లంతేనని రేవంత్‌రెడ్డి సర్కార్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు.
నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని ఎక్కడ, ఎప్పుడు చెప్పారో నిరూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీవో-29ను రద్దు చేయాలని, చట్టబద్ధంగా నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రంలోని గ్రామస్థాయిలో తిరిగి తమకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. కోదండరాం, బల్మూరి వెంకట్, ఆకునూరి మురళి, రియాజ్ లాంటి వారు తమ వద్దకు వచ్చి మూడు నెలలు పుస్తకాలు పక్కనబెట్టాలని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగాలు వస్తాయని చెప్పి తమను నమ్మించి మోసంచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఇక్కడికి రాలేదని తెలిపారు. నిరసనలో కిశోర్, మనోజ్, సంపత్, లక్ష్మీకాంత్, పెద్దఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు.
మండలి ప్రతిపక్షనేతకు వినతి..
అనంతరం త్యాగరాయగానసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారిని కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు.
అన్యాయం జరిగితే ఊరుకోం
తమకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేస్తాం. రైతుబంధు ఇచ్చి రైతుల ఓట్లు రాబట్టాలని చూస్తున్నారు కానీ, ఆ రైతులు మా తల్లిదండ్రులే అనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఊరుకునేదే లేదు.
– కృష్ణ, నిరుద్యోగి
నోటిఫికేషన్లు వద్దన్నది నిరూపించాలి
నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగుల ధర్నాలు చేసిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం దారుణం. నిరుద్యోగులు ఎక్కడ ధర్నా చేశారో ముఖ్యమంత్రి నిరూపించాలి. 18 నెలల్లో ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ల వివరాలను వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలి
-నగేశ్, నిరుద్యోగి