Bhatti Vikramarka | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి.. అది ఏ స్థాయికి వెళ్లిదంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున రావడంతో కొంచెం గ్యాప్ ఇవ్వండని నిరుద్యోగులు అంటున్నారు. నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు ఆందోళనలు చేసే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నది..’ ఇవి ‘రాజీవ్ యువ వికాసం’ ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్య లు. ఉపముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమంలో భట్టి విక్రమార్క చేసిన ఈ వ్యాఖ్యలు నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఓ వైపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే.. నోటిఫికేషన్లు వద్దంటున్నారని చెబుతారా? అని నిరుద్యోగులు దుమ్మెత్తిపోస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు మాత్రమే అందజేసిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు తన తప్పును అంగీకరించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీస్తున్నారు. ఏడాది దాటినా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే.. నోటిఫికేషన్లు వద్దని ఆందోళనలు చేస్తున్నారని అంటారా? అని ప్రశ్నిస్తున్నారు. 57 వేలకు పైగా ఉద్యోగాలు తమ ఘనతేనని కాంగ్రెస్ చెప్తున్నదని.. వాస్తవానికి 10-12 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చిందని నెట్టింట యువత చర్చ పెడుతున్నది.
అసలు కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా 50 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో గ్రూప్- 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదని, జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని మండిపడుతున్నారు. నిజంగా రాష్ట్రంలో భట్టి చెప్పిన పరిస్థితులే ఉంటే.. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రాహుల్‌గాంధీ తెలంగాణకు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నిస్తున్నారు. అశోక్‌నగర్‌లోని సెంట్రల్ లైబ్రరీని ఎందుకు రావడం లేదని, నిరుద్యోగులకు ఎందుకు ముఖం చాటేశారు? అని నిలదీస్తున్నారు. హైదరాబాద్‌లో యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించిన ప్రియాంకాగాంధీ మళ్లీ ఎందుకు ఇక్కడికి అడుగు పెట్టడం లేదని మండిపడుతున్నారు.
ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో భట్టి భృతి విషయమై మాట మార్చిన వైనాన్ని గుర్తుచేసుకుంటున్నారు. భట్టి నిరుద్యోగులను వంచించేందుకు కంకణం కట్టుకున్నారని, అందుకే ఇప్పుడు మరోసారి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి పచ్చి అబద్ధాలు చెప్పడం ఏమిటని, భట్టి నిరుద్యోగ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని చెప్తున్నారు. కాంగ్రెస్ సర్కారు మోసాన్ని గ్రహించిన యువత ఇప్పటికే గుర్రుగా ఉన్నదని, ఇలాగే నమ్మకద్రోహం చేస్తే గద్దెనెక్కించిన చేతులతోనే మళ్లీ దించుతామని హెచ్చరిస్తున్నారు.