హైదరాబాద్ సిటీబ్యూరో, చిక్కడపల్లి, జూలై 22(నమస్తే తెలంగాణ) : ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ను నిరుద్యోగులు నిలదీశారు. అశోక్‌నగర్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం జరిగిన బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్సీ దయాకర్ హాజరయ్యారు. లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు అద్దంకిని చూసి ఆయనను చుట్టుముట్టారు. ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలుచేస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి నిండాముంచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకున్నా ఉద్యోగాలు వద్దని నిరుద్యోగులే ధర్నా చేస్తున్నారని రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని ఫైరయ్యారు. ఉద్యోగాలు వద్దని తామెక్కడ ధర్నా చేశామో చెప్పాలని నిలదీశారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీచేసి, తామే ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రశ్నల వర్షానికి ఉక్కిరిబిక్కిరైన దయాకర్ సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఇచ్చిన హామీలు అమలుకు కృషి చేస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీని అడ్డుకున్న వారిలో శంకర్‌నాయక్, కృష్ణ, వెంకటేశ్, శ్రీను, నరేష్, గణేశ్, సలీం, దామోదర్, రమేశ్, కిరణ్ పాల్గొన్నారు.