ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 12: ఖమ్మం జిల్లా గ్రంథాలయంలోని సమస్యలపై నిరుద్యోగులు రోడ్డెక్కారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తామంతా గ్రంథాలయానికి వస్తే.. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం పక్కనే ఉన్న బస్ డిపో రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. గ్రంథాలయానికి వస్తే కూర్చోడానికి కుర్చీలు, తాగడానికి మంచినీళ్లు లేవని ఆందోళన వ్యక్తంచేశారు. చివరికి అత్యవసరానికి వెళ్దామన్నా కనీసం మరుగుదొడ్లు కూడా లేవని ఆవేదన చెందారు. నిత్యం తాము ఇక్కడ పడుతున్న ఇబ్బందులను అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనకు దిగినట్టు చెబుతున్నారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరుద్యోగులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకున్నది. అయినప్పటికీ తమ సమస్యలను పరిష్కరించాలంటూ పాఠకులు పట్టుబట్టారు. ఆందోళన విరమించకపోతే కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరింపులకు దిగారు. దీంతో తమ భవిష్యత్తు దృష్ట్యా ఉద్యోగార్థులు, నిరుద్యోగులు ఆందోళన విరమించారు.