Telangana | కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయి. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పదేండ్ల పాటు అభివృద్ధి మార్గంలో పరుగులు తీసిన తెలంగాణ.. నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, ఆఖరికి పోలీసులు కూడా రోడ్డెక్కారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రజాపాలన అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన హస్తం పార్టీ నేతలు తెలంగాణలో సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడో అటకెక్కించిన ప్రభుత్వ పెద్దలు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలకూ తిలోదకాలిచ్చారు.
నమ్మించి నట్టేట ముంచిన సర్కారుపై ప్రజల్లో అడుగడుగునా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో ఊరూరా ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. ఏడాది పొడవునా రాష్ట్రమంతా వివిధ వర్గాల ధర్నాలు, నిరసనలతో హోరెత్తింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడింది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు ప్రభుత్వ తీరుపై కదం తొక్కారు. అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పోలీస్ బెటాలియన్ల కుటుంబాలు, ఆర్టిజన్లు, మాజీ సర్పంచులు, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు రోడ్డెక్కి తెలంగాణ సర్కారు నిరంకుశ విధానాలపై నిప్పులుచెరిగారు.
అక్టోబర్ 25: ఏక్పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సచివాలయం ఎదుట ఆందోళనకు దిగిన వివిధ పోలీస్ బెటాలియన్లకు చెందిన సిబ్బంది, కుటుంబ సభ్యులు
జూలై 14: బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చామని, ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పాలకులు తమ గోస వినాలని, గ్రూప్ 2,3 పోస్టులు పెంచిన తర్వాతే పరీక్షలను నిర్వహించాలని అశోక్‌నగర్‌లో ఆందోళనకు దిగిన అభ్యర్థులు
ఏప్రిల్ 6: ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన పంట బోనస్ హామీ మేరకు వెంటనే రూ. 500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట మాట్లాడుతున్న రైతు
సెప్టెంబర్ 26: అర్హతలను బట్టి ప్రమోషన్లు ఇచ్చిన తర్వాతే జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని, డిమాండ్లు నెరవేర్చాలంటూ మింట్ కాంపౌండ్ ఎదుట ధర్నాకు దిగిన 2వేల మంది విద్యుత్తుశాఖ ఆర్టిజన్లు
జూలై 30: సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీ ముట్టడికి తరలివస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
జూలై 9: డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులు
ఆగస్టు 5: తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో పాటు వంటావార్పు నిర్వహించారు. ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 22: కేంద్రం చేపడుతున్న నేవీ రాడార్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని, దామగుండం అడవిని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన పౌరసంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థలు.
ఆగస్టు 3: గ్రామాలాభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు చేశామని, పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగిన మాజీ సర్పంచులు
జూలై 31: సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ తీస్తున్న ఆశా కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
జూలై 1: బీఆర్ఎస్ ప్రభుత్వం అహ్మద్‌గూడలో పేదలకు సకల వసతులతో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పాలనలో కరెంటు, నీరు బంద్ అయ్యాయని నివాసితుల నిరసన తెలిపారు.
సెప్టెంబర్ 5: సకాలంలో బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో విజయ డెయిరీకి పాలుపోసే రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పాలనలో బిల్లుల చెల్లింపు ఆలస్యం అవుతున్నదని మండిపడ్డారు.
నవంబర్ 16: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌లో విద్యార్థులు మహార్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
జూలై 19: సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ సిబ్బంది ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని ఐసీడీఎస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వం తమ గోడు వినడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది.