Rahul Gandhi | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : కులగణనపై చర్చకు హైదరాబాద్‌కు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు రావాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అశోక్‌నగర్‌కు వచ్చి.. తమ సమస్యలు వినాలని కోరుతున్నారు. గత ఎన్నికల సమయంలో వచ్చి కలతచెందానని బూటకపు కన్నీళ్లుకార్చిన రాహుల్‌గాంధీకి తమ ఆక్రందనలు వినిపించడం లేదా..? గతంలో వచ్చినట్టే మళ్లీ ఇప్పుడు రారెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ జేఏసీ పేరుతో బస్సు యాత్రలు జరిపించి, గ్రూప్స్ పోస్టులను పెంచుతామని ఆశచూపించి, ఎన్నికల్లో వాడుకుని, గెలిచాక వదిలేయడం సబబేనా ? అని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. నిరుడు నవంబర్‌లో రాత్రి 8.30 గంటల సమయంలో రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత అశోక్‌నగర్‌కు చేరుకున్నారు. నిరుద్యోగులతో ముచ్చటించారు. నాడు అకస్మాత్తుగా హైదరాబాద్‌లో కనిపించిన రాహుల్ గాంధీ.. నేడు కూడా అంతే వేగంగా వచ్చి తమను ఓదార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నాడు సామాన్యుడిలా హడావుడి లేకుండా నడుచుకుంటూ వచ్చి.. నిరుద్యోగులతో చాయ్ తాగుతూ ఓదార్చినట్టు నటించిన రాహుల్‌గాంధీ.. మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన మా సమస్యలు విని చాయ్ తాగాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
“హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువతను కలిశాను. తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి పదేండ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. వారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే వారికి కొలువులు రాని దుస్థితి. అందుకే వారి కలలు సాకారం అయ్యేలా.. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబ్ క్యాలెండర్‌ను వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు రావాలి. వచ్చి నిరుద్యోగుల సమస్యలు వినాలి. ఏ పుస్తకాలు ప్రామాణికమో.. వేటిని చదవాలో స్పష్టంచేయాలి. ప్రామాణిక పుస్తకాలులేని రిక్రూట్మెంట్ పారదర్శకంగా ఉంటుందా..? అన్నది చెప్పాలి. పోస్టుల పెంపు లేదు. 2లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందో తెలియదు. నిరుడు అశోక్‌నగర్‌కు వచ్చినట్టే ఇప్పుడు అశోక్‌నగర్‌లో అడుగుపెట్టాలి.
నిరుద్యోగులకు న్యాయం చేస్తామని, పోస్టులు పెంచుతామని కాంగ్రెస్ నిరుద్యోగులను వాడుకుని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పూర్తిగా విస్మరించింది. రెచ్చగొట్టి బస్సు యాత్ర చేయించారు. పోస్టులు పెంచకుండా, నిరుద్యోగుల మీద దమనకాండను కొనసాగించారు. కాంగ్రెస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధిచెబుతాం. భవిష్యత్తు లేకుండా భూస్థాపితం చేస్తాం.