వెంగళరావునగర్, సెప్టెంబర్ 19: కలలు కల్లలై.. ఆశలు అడియాసలై నిరాశ నిస్పృహలకు లోనైన ఓ నిరుద్యోగి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నత చదువులు చదివినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతకీ సర్కారు నౌకరీ రాకపోవడంతో ఆ నిరుద్యోగి కుంగిపోయాడు. ట్రాన్స్ఫార్మర్పైకెక్కి కరెంట్ తీగలను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన డీ మల్లేశ్(36) చదువుల్లో చురుకుగా ఉండేవాడు. సివిల్స్ సాధించాలని కలలు కన్నాడు. అందుకోసం గత ఐదేండ్లుగా సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు.
కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగమైనా చేద్దామని నిజామాబాద్ నుంచి 10 రోజుల క్రితం నగరానికి వచ్చాడు. కానీ తాను చదివిన చదువుకు సరైన ఉద్యోగం రాకపోవడంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరికి తిరిగి ఇంటికెళ్లాలన్నా చార్జీలకు డబ్బులు లేని దుస్థితి ఏర్పడింది.దీంతో శుక్రవారం సాయంత్రం ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కాడు. కరెంట్ తీగలపే చేతులతో పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో పైనుంచి కిందపడ్డాడు. తీవ్రగా గాయపడిన అతడిని గాంధీ దవాఖానాకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.