హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందని, ఆ పార్టీని, నాయకులను నమ్ముకున్న పాపానికి తమను నడిరోడ్డుపై నిలబెట్టారని పలువురు నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు సోమవారం తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు(టీజీపీఆర్బీ)కు వినతిపత్రం అందజేశారు. ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, నిరుద్యోగులను ఆదుకుంటామని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా ఒక పోలీస్ ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు. నోటిఫికేషన్లో వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలని కోరారు.
జీవో నంబర్ 46ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. లాంగ్జంప్ను 3.8 మీటర్లకు తగ్గించాలని కోరారు. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. 2022లో కేసీఆర్ హయాంలో ఇచ్చిన పోలీసు నోటిఫికేషన్ తప్ప.. కొత్తగా ఇచ్చినవి ఏమీ లేవని విమర్శించారు. దాదాపు 10 లక్షల మంది పోలీసు నోటిఫికేషన్ కోసం మూడేండ్లుగా ఎదురుచూస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో పోలీసు ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, నవీన్ పట్నాయక్ తదితరులు పాలొన్నారు.