Telangana | హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ)/ హైదరాబాద్ సిటీబ్యూరో/ ఉస్మానియా యూనివర్సిటీ/ ఎల్బీనగర్/చిక్కడపల్లి: ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్-1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో సోమవారం తలపెట్టిన రాష్ట్ర సచివాలయం ముట్టడిని జయప్రదం చేయాలని నిరుద్యోగులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు నిరుద్యోగులు సిద్ధమయ్యారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరేదాకా ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ నిరసనలను ఉధృతం చేస్తున్న నిరుద్యోగులను కట్టడి చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సెక్రటేరియట్ ముట్టడిని భగ్నం చేసేందుకు నిరుద్యోగులను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
చాలాచోట్ల విద్యార్థి నేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు. అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను, నిరుద్యోగులను వెతికిమరీ పట్టుకుని ఠాణాల్లో వేశారు. అశోక్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లోని అన్ని బుక్‌స్టోర్స్, టీ స్టాళ్లను మూసివేయించారు. అశోక్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో అనధికారికంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ప్రతి గల్లీలో పహారా కాస్తున్నారు. సెంట్రల్ ల్రైబ్రరీ వద్ద గస్తీ తిరుగుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లకుండా పికెట్లు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్‌కు వచ్చే దా రుల్లో పోలీసులు భారీగా మోహరించారు.

తెల్లవారుజామునే అరెస్టులు
పరీక్షలు వాయిదా వేయబోమని, పరీక్షలు రాయనోళ్లే దీక్షలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, దిల్సుఖ్నగర్ ప్రాం తాలు నిరుద్యోగులు, అభ్యర్థుల నిరసనలతో అట్టుడికాయి. ఈ సెగ ఉస్మానియా యూనివర్సిటీకి పాకితే ఉద్యమం మరింత తీవ్రరూపం దాలుస్తుందనే అనుమానంతో పోలీసులు ఆదివారం తెల్లవారుజామునే విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. ఉదయం ఆరున్నర గంటలకు హాస్టళ్లలోకి చొరబడి టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, నాయకులు పెద్దమ్మ రమేశ్, సాయిలును అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రాజకీయాలు అంటగడుతరా?
ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న తమ కు రాజకీయాలను అంటగడుతరా? అని నిరుద్యోగులు నిలదీశారు. పరీక్షలకు సమ యం కావాలని కోరితే సీఎం రేవంత్‌రెడ్డి త మను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు ఆందోళనలు కొనసాగించారు. నిజాయితీగా, న్యాయబద్ధంగా ఆందోళన చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీలను అంటగట్టి రాజకీయం చేయ డం సమంజసం కాదని హితవుపలికారు.
16మంది అరెస్ట్.. ఠాణాలకు తరలింపు
శనివారం అర్ధరాత్రి అశోక్‌నగర్ చౌరస్తా వద్ద మెరుపు ధర్నాకు దిగిన నిరుద్యోగులు ఆదివారం ఉదయం దాకా నిరసన తెలిపారు. రాత్రంతా నినాదాలు, తెలంగాణ ఉద్యమ పా టలతో ధర్నా కొనసాగించారు. పోలీసులు, ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 16 మంది నిరుద్యోగులను అరెస్టు చేసి బొల్లా రం, ఫలక్‌నుమా పీఎస్‌లకు తరలించారు.
బీసీ నేతల నిర్బంధం
నిరుద్యోగులకు మద్దతుగా సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడివారిని అక్కడ ముందస్తు అరెస్టులు చేసి, నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే బీసీ సంఘాల నేతల ఇండ్లకు వెళ్లి ఫొటోలు తీసుకుని కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.
జయప్రదం చేయండి : రాజారాం యాదవ్, ఆర్ కృష్ణయ్య పిలుపు
సెక్రటేరియట్ ముట్టడిని జయప్రదం చే యాలని బీసీ జనసభ అధ్యక్షడు రాజారాం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్లు, విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి రాజుతో కలిసి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.