DSC | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ పరీక్షలను మూడు నెలలపాటు వాయిదావేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు, అభ్యర్థులు పిలుపునిచ్చారు. టెట్ పరీక్షలు నిర్వహించిన వెంటనే డీఎస్సీ నిర్వహించే విషయంపై అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రెండింటి సిలబస్ వేరు కావడం, డీఎస్సీ ప్రిపరేషన్‌కు తగిన సమయం లేకపోవడంతో అభ్యర్థులంతా డీఎస్సీ పరీక్షలను వాయిదావేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్‌లో పరీక్షలను నిర్వహించి, వచ్చే ఏడాది జూన్‌లో పోస్టింగ్స్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు విద్యా వలంటీర్లను నియమించాలని కోరుతున్నారు. ఈ నెల 8న నిర్వహించే చలో డీఎస్ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని నిరుద్యోగ జేఏసీ, నేతలు, డీఎస్సీ అభ్యర్థులు పిలుపునిచ్చారు.