నమస్తే తెలంగాణ, నెట్వర్క్: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిరుద్యోగ యువత చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిర్బంధకాండ విధించారు. తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యువజన విభాగం, డీవైఎఫ్ఐ, పీడీఎస్‌యూ తదితర నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్లలో నిర్బంధించారు. అయినా పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడికి అన్ని జిల్లాల నుంచి యువత తరలివెళ్లింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వీ, డీవైఎఫ్ఐ నాయకులను పోలీసులు గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి భద్రాచలం, ఇల్లెందు, ముదిగొండ, మణుగూరు పోలీస్స్టేషన్లలో ఉంచారు. భద్రాచలంలో బీఆర్ఎస్వీ నాయకులు కీసరి యువరాజు, షేక్ రోహిత్పాషా, మేడి రవికుమార్, ముదిగొండలో డీవైఎఫ్ఐ నాయకులు మెట్టెల సతీశ్, భట్టు రాజు, లక్ష్మణ్‌రావు, ఇల్లెందులో బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు గిన్నారపు రాజేశ్, కాసాని హరిప్రసాద్, సత్తాల హరికృష్ణను పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు, కార్యకర్తలను పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఖర్గే హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం వరకు పోలీస్స్టేషన్లలోనే ఉంచారు. కరీంనగరంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్తోపాటు నాయకులు ఆరే రవి గౌడ్, పటేల్ సుధీర్‌రెడ్డి, చుక శ్రీనివాస్, పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, బోనకుర్తి సాయి కృష్ణ, నదీం, అన్వేశ్ తదితరులను అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉదయం బీఆర్ఎస్వీ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉండే విద్యార్థి, నిరుద్యోగులతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులను గురువారం అర్ధరాత్రి నుంచే అరెస్టు చేశారు. కొందరిని హౌస్ అరెస్టులు కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిర్బంధకాండ విధించారు.