2014కు ముందు.. ప్రభుత్వ దవాఖాన అనగానే పెచ్చులూడే భవనాలు, పాత సామాను, ఔషధాల కొరత, జిల్లా దవాఖానల్లోనూ అరకొర వసతులు, పోస్టులు ఖాళీగా ఉండటంతో అనేకచోట్ల నర్సులు, కాంపౌండర్లే వైద్యం అందించిన దుస్థితి.
పదేండ్లలో.. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో వైద్యరంగం రూపురేఖలు మారిపోయింది. పీహెచ్‌సీలు మొదలు సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు అన్ని భవనాలు బాగయ్యాయి. వేల డాక్టర్ పోస్టులను ప్రభుత్వం నింపింది. మూడు నెలలకు సరిపడా మందులను ముందస్తుగా నిల్వ ఉంచింది. అన్ని స్థాయిల్లో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
KCR | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్యరంగం.. స్వరాష్ట్రంలో పదేండ్ల పాలనలో ఆరోగ్య తెలంగాణగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వినూత్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజావైద్యం మెరుగుపడింది. బస్తీ, పల్లె దవాఖానలు, పీహెచ్‌సీలు, ఏరియా దవాఖానలు సమర్థంగా పనిచేస్తున్నాయి. ప్రతి జిల్లాకేంద్రంలో ఆధునిక వసతులతో జిల్లా దవాఖాన అందుబాటులోకి వచ్చాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్థానికంగానే స్పెషాలిటీ సేవలు అందుతున్నాయి.
వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే గుర్తిస్తే ముదురకుండా నివారించటంతో పాటు ప్రభుత్వం, వైద్యరంగంపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ సూత్రాన్ని అమలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కోసం పల్లె దవాఖానలు, పట్టణ ప్రాంతాల పేదల కోసం బస్తీ దవాఖానలను ప్రవేశపెట్టింది. పీహెచ్‌సీలను బలోపేతం చేసింది.
నగరాల్లోని ప్రజలు చిన్నచిన్న జబ్బులు వస్తే సమీపంలో ఆర్ఎంపీల దగ్గరికో, ప్రైవేట్ దవాఖానలకో వెళ్లి డబ్బు ఖర్చు చేసుకోవాల్సి వచ్చే ది. ఈ ఖర్చును తప్పించేందుకు కేసీఆర్ ప్రభు త్వం బస్తీ దవాఖానలకు రూపకల్పన చేసింది. 2018లో హైదరాబాద్‌లో ప్రారంభమై రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు విస్తరించింది. మొత్తం 370 వరకు బస్తీ దవాఖానలను ఏర్పా టు చేసింది. ఏటా సుమారు 50 లక్షల మంది వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. బస్తీ దవాఖానల్లోనే ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, మందులు అందిస్తుండటంతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌పై ఓపీ భారం గణనీయంగా తగ్గింది.
హెల్త్ అండ్ వెల్నెస్ పథకం కింద పల్లె దవాఖానాల ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకా రం చుట్టింది. 3,200 గ్రామాల్లో సబ్సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చింది. రూ.247 కోట్లకుపైగా ఖర్చుతో 1,239 సబ్ సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించగా, 1,497 సబ్ సెంటర్ల భవనాలను రూ.60 కోట్లతో మరమ్మతులు చేయించే పనులు చేపట్టింది.
ప్రాథమిక వైద్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కేసీఆర్ సర్కారు పీహెచ్‌సీలను బలోపేతం చేసింది. రూ.43 కోట్లతో 372 పీహెచ్‌సీల మరమ్మతులు చేపట్టింది. రూ.67 కోట్లతో 43 కొత్త పీహెచ్సీ భవనాలను నిర్మించింది. కొత్తగా ఏర్పడిన 40 మండలాలకు పీహెచ్‌సీలు మంజూరు చేసింది. పీహెచ్‌సీల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు రికార్డు సమయంలో ఏకంగా 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించింది.
కొత్త జిల్లాల ఏర్పాటుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకేంద్రంలో ఒక జిల్లా దవాఖానను మంజూరు చేసింది. దీంతో ప్రజలకు సమీపంలోనే స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలోని 27,500 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించే కార్యక్రమం గత ఏడాది పూర్తయింది. దీనికితోడు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో అటు వైద్యవిద్యతోపాటు ఇటు స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సూపర్ స్పెషాలిటీ మెరుగు కోసం.. హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరుతో 26 ఏప్రిల్ 2022న అల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో టిమ్స్ నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు.
ఇందులో 30 రకాల విభాగాల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, వైద్యవిద్య అందుబాటులోకి రానున్నాయి. అల్వాల్‌లో 28.41 ఎకరాల్లో రూ.897 కోట్లు, గడ్డి అన్నారంలో 21.36 ఎకరాల్లో రూ.900 కోట్లు, ఎర్రగడ్డలో రూ.882 కోట్లతో పనులు ప్రారం భమయ్యాయి. అదనంగా నిమ్స్‌లో 2,000 సూపర్ స్పెషాలిటీ పడకల పనులు ప్రారంభమయ్యాయి.వరగంల్లో 24 అంతస్థుల హెల్త్ సిటీ నిర్మాణం తుది దశలోఉన్నది.రూ.1,200 కోట్లతో 2021 జూన్ లో 59 ఎకరాల్లో పనులు మొదలయ్యాయి.ఇది పూర్తయితే 8,200 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి.
మాతాశిశు సంరక్షణకు తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి వాహనాలు, ఆరోగ్యలక్ష్మి వంటి చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి.
గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు న్యూట్రిషన్ కిట్ల పథకాన్ని గత ప్రభుత్వం 2022 డిసెంబర్ 21న 9 జిల్లాల్లో ప్రారంభించి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసింది. రూ.1,962 ఖర్చుతో ఒక్కో కిట్‌లో 8 రకాల వస్తువులు అందించింది. దీనికి కేసీఆర్ ప్రభుత్వం రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించింది.
గర్భిణులు సురక్షితంగా ఇంటి నుంచి దవాఖానలకు వెళ్లి, పరీక్షలు చేయించుకొని తిరిగిరావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 300 అమ్మఒడి వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా సుమారు 19 లక్షల మంది లబ్ధి పొందారు.
కేసీఆర్ ప్రభుత్వం వైద్యారోగ్యరంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచింది. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా, 2023-24 నాటికి రెండున్నర రెట్లు పెంచి ఏకంగా రూ.12,364 కోట్లకు చేర్చింది. అంటే హెల్త్ బడ్జెట్ 150 శాతం పెరిగింది. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. ‘తొలి విడతలో సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమంపై ఎక్కువగా దృష్టిపెట్టాం. రెండో విడతలో విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం’ అని కేసీఆర్ గతంలో ప్రకటించారు. అందుకు తగ్గట్టే 2019 నుంచి భారీగా పెరిగాయి. 2019-20లో రూ.5,783 కోట్లుగా ఉన్న బడ్జెట్.. 2023-24 నాటికి 113 శాతం పెరిగింది. తలసరి కేటాయింపులు రూ.3,440గా నమోదైంది. తద్వారా తలసరి కేటాయింపుల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. పెద్ద రాష్ర్టాల్లో తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
2017లో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు, ప్రసవం చేయించుకునే మహిళలకు మూడు విడతలుగా మొత్తం రూ.12 వేలు, ఆడపిల్లల జన్మిస్తే మరో రూ.వెయ్యి అదనంగా నగదును ప్రభుత్వం అందించింది. అదనంగా తల్లీబిడ్డకు అవసరమయ్యే వస్తువులతో రూ.2 వేల కిట్‌ను అందించింది. గత ఏడాది చివరినాటికి దాదాపు 14 లక్షల మంది లబ్ధి పొందారు. కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.1,300 కోట్లు ఖర్చు చేసింది.
మాతాశిశు సంరక్షణకు పథకాలు అమలు చేయడమే కాదు.. ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంసీహెచ్‌లను ఏర్పాటు చేసింది. రూ.407 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 22 ఎంసీహెచ్‌లను ఏర్పాటు చేసింది. గాంధీ దవాఖానలో దేశంలోనే తొలిసారిగా సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిమ్స్ విస్తరణలో భాగంగా 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ను నిర్మిస్తున్నారు.
కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలతో 2021-22లో ఏఎన్సీ రిజిస్ట్రేషన్లలో దేశంలోనే పెద్ద రాష్ర్టాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గర్భిణులకు సమయానికి వ్యాక్సిన్లు వేయగలిగారు. వందశాతం దవాఖానల్లోనే సురక్షిత ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 2014లో 31 శాతంగా ఉండగా, గత ఏడాదిలో 62 శాతానికి పెరిగాయి. కేసీఆర్ కిట్‌తో కలిగిన మరో ప్రయోజనం.. అతితక్కువ అబార్షన్లు. గర్భిణుల నమోదు నుంచి డెలివరీ వరకు సిబ్బంది ఏఎన్సీ చెకప్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుండటంతో ఇది సాధ్యమైంది. మాతాశిశు మరణాలు తగ్గాయి. పిల్లలందరికీ టీకాలు అందించడంలో తెలంగాణ ముందువరుసలో నిలిచింది.
అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రభుత్వం కంటివెలుగు పథకానికి రూపకల్పన చేసింది. 2018లో నిర్వహించిన కంటి పరీక్షలు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. దీనికి కొనసాగింపుగా ‘కంటివెలుగు-రెండో విడత’ కార్యక్రమాన్ని గతేడాది జనవరి 18న ఖమ్మం వేదికగా ప్రారంభించారు. కోటిన్నర మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 40 లక్షల మందికి ఉచితంగా కండ్లద్దాలు పంపిణీ చేశారు. వీటితోపాటు ఎన్సీడీ స్క్రీనింగ్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం, పీహెచ్‌సీల్లో లైవ్ కెమెరాలు, డైట్, శానిటేషన్ చార్జీల పెంపు, నూతన అంబులెన్స్‌ల కొనుగోలు, పార్థివ వాహనాలు, టిఫా స్కానింగ్ యంత్రాలు, రోగి సహాయకులకు భోజనం, టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్, టెలీ కన్సల్టెన్సీ సేవలు వంటి అనేక పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. ఫలితంగా రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలిచింది. అటు ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. అన్ని స్థాయిల దవాఖానల్లో ఓపీ, ఐపీ, సర్జరీల సంఖ్య గణనీయంగా పెరిగింది.
దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతా ల్లో వైద్యారోగ్య రంగం పనితీరును విశ్లేషి స్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ 2021లో ‘హెల్త్ ఇండెక్స్’ను విడుదల చేసింది. ఇందులో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. పురోగతిలో దేశంలోనే మొదటి స్థానం లో.. వ్యాక్సినేషన్, ప్రసవాల పురోగతిలో దేశంలో నే టాప్‌లో నిలవటం విశేషం.
గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. అంగన్వాడీల్లో గర్భిణు లు, బాలింతలకు 25 రోజులు అన్నం, పప్పు (పప్పు, ఆకుకూరలు, కూరగాయలతో సాంబార్), ఉడికించిన గుడ్డు అందించారు. పదేండ్లలో సుమా రు 37 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. ఆరోగ్యలక్ష్మిని నీతిఆయోగ్ ప్రశంసించింది.
వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం టీ డయాగ్నస్టిక్స్‌ను ప్రారంభించింది. ఇందులో 135 రకాల రోగానిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. ఆటో అనలైజర్లు, డిజిటల్ ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్ సాన్ మెషీన్లు, 2డీ ఎకో, మామోగ్రామ్, హైఎండ్ డయాగ్నస్టిక్ పరికరాలు ఈ హబ్‌లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పీహెచ్‌సీలు మొదలు అన్నిస్థాయిల దవాఖానలను టీ డయాగ్నస్టిక్స్‌కు అనుసంధానం చేసింది. దీంతో పేదలు అటు చికిత్సకు, ఇటు వ్యాధి నిర్ధారణకు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.
అన్ని దవాఖానల్లో ఓపీ, ఐపీ పేషంట్లకు కలిపి సుమారు 1.65 కోట్ల మందికి టెస్టులు నిర్వహించగా, దాదాపు రూ.250 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేసినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. గుండెపోట్లను వెంటనే గుర్తించి చికిత్స అందించేందుకు స్టెమీ కార్యక్రమం ప్రారంభించింది. ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం, రిమ్స్ ఆదిలాబాద్, ఖమ్మంలో క్యాథ్‌ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు 74 ఉపకేంద్రాల ద్వారా ఈసీజీలు తీస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాల సంఖ్య 3 మాత్రమే. దాన్ని 102కు పెంచారు. దీనికితోడు ఏటా 150 వరకు కిడ్నీమార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయించారు. క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో అవసానదశకు చేరిన పేషెంట్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం 33 పాలియేటివ్ కేర్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. రోగుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ, చివరి రోజులను ప్రశాంతంగా గడిపేందుకు ఈ కేంద్రాలు సేవలందిస్తాయి.
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కేవలం 700. ఉస్మానియా, గాంధీ, వరంగల్ (కాకతీయ), ఆదిలాబాద్ (రిమ్స్) కాలేజీలు ఉండేవి. పేదలకు స్పెషాలిటీ సేవలు అందించటంతోపాటు, డాక్టర్ కావాలనుకొనే విద్యార్థుల కలను సాకారం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
ఇందులో భాగంగా 2016లో 4 మెడికల్ కాలేజీలు సిద్దిపేట, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేటలో ప్రారంభించారు. దీంతో ఎంబీబీఎస్ సీట్లు 1,640కి పెరిగాయి.
2021లో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. దీంతో మరో 1,200 సీట్లు పెరిగాయి. 2022లో నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌ల్లో మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. చివరిగా గత ఏడాది మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఈ ఏడాది ఎన్ఎంసీ తనిఖీ ప్రక్రియ జరుగుతున్నది. వీటికి కూడా అనుమతులు వస్తే జిల్లాకో మెడికల్ కాలేజీ పూర్తి కానున్నది.
‘మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ అనే నానుడికి అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని అమలు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత ఏడాది మార్చి 8న నాటి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 8 రకాల పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో ఏడాదిపాటు కార్యక్రమం కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. రాష్ట్రంలోని 90 లక్షలకుపైగా కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 2021 మేలో ‘ఆయుష్మాన్భారత్-ఆరోగ్యశ్రీ’ విలీనం చేశారు. ప్రస్తుతం ఒకో కుటుంబానికి సంవత్సరానికి గరిష్ఠ కవరేజీ పరిమితి రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెరిగింది. మే 2023 వరకు 15,39,994 మంది ఆరోగ్యశ్రీ సేవలను నియోగించుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.6,823,59 కోట్లు ఖర్చు చేసింది.
దశాబ్దకాలంగా క్రమంగా బాగుపడిన వైద్యారోగ్య వ్యవస్థ ఆరు నెలల్లోనే తిరోగమనం దిశగా సాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ప్రభుత్వం ఒకేసారి హెల్త్ సెక్రటరీ, డీపీహెచ్, డీఎంఈలను మార్చింది. దీంతో ఒక్కసారిగా పర్యవేక్షణ కరువైంది. ఉన్నతాధికారులు మారడం, మంత్రి సైతం పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో అన్ని స్థాయిల దవాఖానల సిబ్బందిలో అలసత్వం మొదలైంది.
పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో దవాఖానలకు మందుల సరఫరాను నిలిపివేశారు. గర్భిణుల కోసం ఉద్దేశించిన న్యూట్రిషన్ కిట్ పథకం పూర్తిగా ఆగిపోయింది. 7 వేల మందికి నర్సింగ్ ఆఫీసర్లుగా నియామక పత్రాలు ఇచ్చినా ఇప్పటికీ సగం మందికి నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సుమారు 20వేల మంది ఉద్యోగులకు రెండు నెలల జీతాలు పెండింగ్‌లో ఉంటున్నాయి.