Telangana | సిద్దిపేట, జూలై 27 (నమస్తే తెలంగాణప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు నేడు బోసిపోయి కనిపిస్తున్నాయి. రిజర్వాయర్లను నింపి చెరువులకు నీటిని విడుదల చేస్తే భూగర్భ జలాలు పెరిగి గత ఏడాది తరహాలో తాము సాగు చేసుకోవచ్చని భావిస్తూ రైతులు ఆశగా సాగు నీటికోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వానల కోసం మొగులు వైపు చూస్తున్నారు. ఫలితంగా ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగు లక్ష్యంలో సగానికిపైగా విస్తీర్ణంలో నాట్లు పడలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండుటెండల్లో కాళేశ్వర జలాలను చెరువులకు విడుదల చేయడంతో చెరువులు నిండుకుండలా కనిపించాయి. వర్షాకాలం ప్రారంభం కాగానే కొద్దిపాటి వర్షానికి చెరువులు నిండిపోయేవి. దీంతో పుష్కలంగా సాగు నీరు అందింది. గత వేసవిలో కాళేశ్వర జలాలను విడుదల చేయకపోవడంతో చెరువులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వర జాలలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది.
బీడు పొలాలనూ పారించిన బీఆర్ఎస్ సర్కార్
సిద్దిపేట జిల్లాలో కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. సిద్దిపేట జిల్లాలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ఉన్నాయి. నాలుగేండ్లుగా ఎప్పుడు కాళేశ్వరం నీటితో కళకళలాడిన ఈ రిజర్వాయర్లు నేడు నీళ్లు లేక బోసిపోయాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎక్కడో పుట్టిన గోదావరి నీళ్లు ఇక్కడికి తీసుకువచ్చి బీడుబారిన పొలాలను పారించారు. రికార్డు స్థాయిలో రిజర్వాయర్లను, ప్రధాన కాల్వలను పూర్తి చేయించి ప్రతి చెరువు, వాగును, చెక్‌డ్యాంను మండుటెండల్లోనూ నింపారు. పుష్కలంగా పంటలు పండాయి. అలాంటి జిల్లాలో ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా 50 శాతం వరి నాట్లు పడలేదు. సాగు నీటి కష్టాలతోనే రైతులు వరి నాట్లు వేయడం లేదు. వారం రోజుల నుంచి జిల్లాలో సాధారణ వర్షం తప్పా.. పెద్ద వానలు కురిసిన సందర్భం లేదు. ఇప్పుడిప్పుడు రైతులు వరి నాట్లు వేస్తున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు రైతుల గురించి పట్టించుకోవడం లేదు. కనీసం కట్టిన ప్రాజెక్టులకు నింపి రైతులకు సాగు నీరు అందిద్దామనే ఆలోచన సైతం అధికార పార్టీకి రావడం లేదని రైతులు మండిపడుతున్నారు.
అడుగంటిన రిజర్వాయర్లు
ఏటా కాళేశ్వర జలాలతో కళకళలాడిన రిజర్వాయర్లు నేడు నీళ్లులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వాయర్లను నింపి పెట్టింది. అవసరాన్ని బట్టి చెరువులకు నీటిని విడుదల చేసుకునే విధంగా సిద్ధం చేసి ఉంచింది. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టునే నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నది. జిల్లాలోని ప్రధాన కాల్వలతోపాటు, మైనర్ కాల్వల్లో మట్టి, పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. కనీసం కాల్వలను శుభ్రం చేద్దామనే ఆలోచన కూడా ప్రభుత్వానికి రావడం లేదు.
అప్పుడే బాగుండే..
కేసీఆర్ సర్కారే బాగుండె. గి కాంగ్రెస్ వచ్చాక బాగా ఇబ్బంది అయితాంది. గత ప్రభుత్వం మల్లన్నసాగర్ ద్వారా చెరువులను నింపింది. పంట పొలాలతోపాటు భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుండె. ఈ సారి మల్లన్నసాగర్ నింపక పోవడం.. టైమ్‌కు వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నం. మల్లన్నసాగర్ ఉందని చాలా సంతోషం ఉండే. కాంగ్రెస్ వచ్చినంక ఆ సంతోషమే లేకుండా పోయింది.
– జీడిపల్లి స్వామి, లింగాపూర్, మం: తొగుట, జిల్లా సిద్దిపేట
తప్పని సాగునీటి కష్టాలు
మాకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. గత ప్రభుత్వం మా దగ్గర్లోని కొండపోచమ్మ సాగర్‌ను ఎప్పుడు నిండుకుండలా ఉంచే ది. దాంతో రైతా ంగానికి సాగునీరు అందించేది. గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించడంతో ఎక్కువగా వరిసాగు చేసేవాళ్లు. నేడు అటు వర్షాలు లేక ఇటు ప్రభుత్వం సాగునీళ్లు అందించకపోవడంతో చాలామంది వరినాట్లు వేయలేకపోయారు. కొండపోచమ్మ సాగర్‌ను నింపకపోవడంతో సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్నట్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా సకాలంలో సాగునీళ్లు అందించి భరోసా కల్పించాలి.
-గడ్డం ప్రవీణ్‌కుమార్, గంగాపూర్, మం: గజ్వేల్, జిల్లా సిద్దిపేట